ఉగ్రవాదంపై పరిణామాలు తధ్యం.. పాక్ కు భారత్ హెచ్చరిక

ఉగ్రవాదానికి పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ, ఆత్మరక్షణ కోసం భారత్ చర్యలు తీసుకుంటుందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా పాకిస్థాన్ కు భారత్ స్పష్టం చేసింది. సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలకు భారత్ శనివారం ఘాటుగా బదులిచ్చింది. దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ షరీఫ్ వ్యాఖ్యలను “విచిత్రంగా” అభివర్ణించారు. 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే నివసిస్తున్నాడని ఆమె సభకు గుర్తుచేశారు.
 
“అమెరికా ఇప్పుడే 9/11 దాడుల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దాని సూత్రధారి పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రముఖ అకాడమీకి సమీపంలోనే నివసిస్తున్నాడు,” అని ఆమె ఎత్తి చూపారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కపటత్వాన్ని ఎత్తిచూపుతూ, ఆ దేశం “పగటిపూట భద్రతను కాపాడుతున్నామని చెప్పుకుంటూ, రాత్రిపూట ఉగ్రవాదానికి పాల్పడుతోంది” అని భారత్ పేర్కొంది. 
 
“ఉగ్రవాదులకు పారిపోవడానికి గానీ, దాక్కోవడానికి గానీ చోటు ఉండదని గతేడాదే మేము నిరూపించాం. ఉగ్రవాదం నుండి మమ్మల్ని మేము రక్షించుకునే హక్కును వినియోగించుకుంటాం. పాకిస్తాన్ కొనసాగించే ఉగ్రవాదానికి పరిణామాలు ఉంటాయి,” అని భారత దౌత్యవేత్త స్పష్టం చేశారు.  “పాకిస్తాన్ ప్రతినిధులు అబద్ధాలతో చెప్పేదాన్ని బట్టి కాకుండా, దాని విధానాలను ఉన్నది ఉన్నట్లుగా గుర్తించాలని” భారత్ ఐక్యరాజ్యసమితి అసెంబ్లీకి పిలుపునిచ్చింది.
“ఏడాదికి ఏడాది అబద్ధాలను పునరావృతం చేయడం వల్ల అవి నిజం కావు. పాకిస్తాన్ కపటత్వం, మోసం వల్ల దానికి గానీ, ప్రపంచానికి గానీ ప్రయోజనం చేకూరదు” అని ఆమె హితవు చెప్పారు. షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ 2025 నాటి సంఘర్షణ అంచుకు దక్షిణాసియా మళ్లీ చేరకుండా చూడాలంటే, కాశ్మీర్ సమస్యకు న్యాయమైన, నిష్పక్షపాతమైన పరిష్కారం అవసరమని పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్‌ను “భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం”గా అభివర్ణిస్తూ, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను గెహ్లాట్ ఎత్తి చూపారు.  “ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు దృష్టి సారిద్దాం. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న విచక్షణారహిత హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి రావల్‌కోట్ ప్రజలను అడగండి,” అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల గురించి పాకిస్తాన్ చేస్తున్న ‘కపట ప్రబోధాలను’ తీవ్రంగా విమర్శించారు. 
 
“పాకిస్తాన్ అనేది సైన్యం యొక్క, సైన్యం కోసం, సైన్యం చేత నడిచే పాలన. వారి కీలుబొమ్మలు మారవచ్చు, కానీ అధికారం చెలాయించేది మాత్రం సైన్యమే” అని ఆమె స్పష్టం చేశారు.  మత సహనం గురించి షరీఫ్ చేసిన ప్రస్తావనపై, భారత్ ఇస్లామాబాద్ వాస్తవ చరిత్రను ఎత్తి చూపింది. “పాకిస్తాన్ పాలనలో దైవదూషణ చట్టాలు ప్రధానాంశంగా ఉన్నాయి. పాకిస్తాన్ తన మైనారిటీలను ఎలా చూస్తుందో ప్రపంచానికి తెలుసు” అని ఆమె తెలిపారు. 

About The Author