అశేష భక్త వాహిని జయజయధ్వానాల మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. 11 రోజుల పాటు భక్తులతో ధూపదీప నైవేద్యాలందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడిని చేరుకున్నాడు. ఈ క్రతువును చూసేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హైదరాబాద్ నగరం జనసంద్రంగా మారింది.
తొలుత బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపంతో బడా గణేశ్ టస్కర్‌పైకి ఆలస్యంగా చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర, క్రేన్‌లో సమస్య కారణంగా 3 గంటల ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమైంది. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై’ అంటూ భక్తుల జయజయధ్వానాలు మార్మోగాయి. అశేష భక్తజనావళి నినాదాల మధ్య ఆ గణనాథుడు గంగమ్మ ఒడిని చేరాడు.
ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన 5వ నెం బర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసరదాల్లో డప్పులు, నృత్యాలతో గణకనాధులు తరలివెళ్తున్నాయి. పండ్లు,పూలతో అలంకరించిన వాహనాల్లో గణేశుడి శోభయాత్ర జరుగుతోంది. గణేష్ నిమజ్జనాన్ని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ పరిశీలించారు. నిమజ్జన ఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పూజల్లో హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తో పాటు అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ఎప్ఒ జయప్రకాష్, ఎస్ఎఫ్ఒ చంద్రశేఖర్ బాబు కూడా ప్రత్యేక నిమజ్జన పూజల్లో పాల్గొన్నారు. ఎన్ టిఆర్ మార్గంలోని హైడ్రా కంట్రోల్ రూమ్ వేదిక నుంచి నిమజ్జనాన్ని పరిశీలించారు. హైడ్రా బోట్స్ పహారాను పరిశీలించడంతో పాటు నిమజ్జనం పూర్తయ్యేవరకు అన్ని శాఖలతో హైడ్రా అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట ముగిసింది. ఈసారి లడ్డూకు భారీగా పోటీ నెలకొనగా.. సామ ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ.39 లక్షలు చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. దీంతో బాలాపూర్ లడ్డూ వేలంలో మరోసారి భారీ ధర నమోదైంది. ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో గణేశ్ నిమజ్జన సందడి నెలకొంది.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను తీసుకొచ్చే వాహనాలతో ప్రధాన మార్గాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్ బడా గణేశుడికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సాగే మార్గాన్ని పోలీసులు నియంత్రించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలు చేపట్టారు.
నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు, శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన సన్నాహాలను నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకుముందు పోలీసు అధికారులతో కలిసి బడా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగరాన్ని భారీ భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. 20 వేల మందికి పైగా సిబ్బందితో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఇక మహా నిమజ్జన శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. గణేశ్ నిమజ్జనం, శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు నేపథ్యంలో చార్మినార్, పాతబస్తీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తనిఖీలు, నిఘా, బందోబస్తును కొనసాగిస్తున్నారు.
More Stories
కలకత్తాలో ఆర్ఎస్ఎస్ మరో కార్యాలయం `కేశవ స్మృతి’
దీనదయాళ్ కు దత్తాత్రేయ ఘనంగా నివాళులు
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు ప్రపంచానికి దిక్సూచి