ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ఆంక్షలపై ఉత్సవ సమితి నిరసనలు

ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ఆంక్షలపై ఉత్సవ సమితి నిరసనలు
* ఉత్సవ సమితి సభ్యులను అరెస్టు చేయడం దుర్మార్గం .. కిషన్ రెడ్డి 
గణేష్ నిమజ్జనాల విషయంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుస్సేన్‌సాగర్‌లోని ట్యాంక్‌బండ్ వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్సీలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వినాయక నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ సోమవారం ట్యాంక్‌బండ్ వద్ద భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. 
 
భక్తులు గణేశ విగ్రహ నిమజ్జనం చేయకుండా నిరోధించడానికి రైలింగ్ వెంబడి ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి సభ్యులు తొలగించడంతో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనలో ఉన్న సమితి సభ్యులు ట్యాంక్ బండ్‌కు చేరుకుని, వారిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ బారికేడ్లను తొలగించడం ప్రారంభించారు. విగ్రహ నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) విఫలమైందని ఆరోపిస్తూ, “ జీహెచ్ఎంసి  డౌన్ డౌన్” వంటి నినాదాలు చేశారు. 
 
ట్యాంక్ బండ్ వద్ద భక్తులను నిమజ్జనం కొనసాగించడానికి అనుమతించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉండటంతో, పోలీసులు నిరసనకారులను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ట్యాంక్ బండ్‌పై ధర్నాకు దిగేందుకు ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు ఆ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 
 
నిమజ్జనాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో బైఠాయించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని బారికేడ్లను వారు తొలగించారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలపై ఆంక్షలు తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం చేయకూడదని సూచించే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.  ట్యాంక్‌బండ్‌పై నుంచి విగ్రహాలను నేరుగా సరస్సులోకి వేయకుండా 10 అడుగుల రైలింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో నిమజ్జనానికి క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు వెల్లడించిన ప్రకారం అక్కడ మట్టి, పర్యావరణహిత విగ్రహాలకు నిమజ్జన సదుపాయం కల్పిస్తున్నారు. పీఓపీ విగ్రహాల కోసం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లో కృత్రిమంగా బేబీ పాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం ట్యాంక్‌బండ్‌ను సంప్రదాయ నిమజ్జన ప్రాంతంగా పేర్కొంటూ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
 

విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ట్యాంక్‌బండ్ వద్దే నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు విధించిన ఆంక్షలను అంగీకరించబోమని సమితి ప్రతినిధులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులే ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఏర్పాట్లు చేయాలని లేకపోతే తామే క్రేన్లను తీసుకువచ్చి నిమజ్జనాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే గణేష్ నిమజ్జనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాయి. వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక నిమజ్జన కొలనులు, క్రేన్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టినట్లు ప్రభుత్వ టెండర్ వివరాలు కూడా వెల్లడిస్తున్నాయి. ట్యాంక్‌బండ్ పరిసరాల్లోనూ నిమజ్జన ఊరేగింపులకు సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేపట్టినట్లు టెండర్ రికార్డుల్లో ఉంది.


కాగా,హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవ సమితి సభ్యులను అరెస్టు చేయడం దుర్గార్గం అని మండిపడ్డారు.
భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణ మొదలుకుని నిమజ్జనం వరకు క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 47 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు, వివిధ శాఖలకు సహకరిస్తూ, లక్షలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పనిచేస్తోందని తెలిపారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని పక్కనపెట్టి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.  న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, భారీ విగ్రహాల నిమజ్జనానికి ఆచరణాత్మకమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.