మ్యూచువల్ ఫండ్స్ లో తెలుగు ప్రజలు 2.95 లక్షల కోట్ల పెట్టుబడి

మ్యూచువల్ ఫండ్స్ లో తెలుగు ప్రజలు 2.95 లక్షల కోట్ల పెట్టుబడి
తెలుగు రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్‌కే పరిమితమైన తెలుగు ప్రజలు, ఇప్పుడు ఆర్థిక మార్కెట్లపై ఆసక్తి చూపుతూ మ్యూచువల్ ఫండ్స్ వైపు పెద్దఎత్తున అడుగులు వేస్తున్నారు. 
 
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల నిర్వహణ విలువ ఏకంగా రూ. 2.95 లక్షల కోట్లకు చేరుకుంది. తెలంగాణలో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం వృద్ధితో రూ. 2,12,856 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 
 
ఇందులో ఒక్క హైదరాబాద్‌ నగర వాటాయే సుమారు 87 శాతంగా ఉండటం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 23 శాతం వృద్ధితో రూ. 82,409 కోట్లకు చేరుకున్నట్లు ఆంఫీ వెల్లడించింది. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలు పెట్టుబడుల్లో ముందున్నాయి. ఈ వృద్ధికి ప్రధాన కారణం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్  విధానంపై అవగాహన పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. 
 
చిన్న మొత్తాలతో క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు యువతతో పాటు మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. తెలంగాణలో దాదాపు 19.60 లక్షల మంది, ఏపీలో 20.94 లక్షల మందికి పైగా ఇన్వెస్టర్లు ఉండగా, వీరిలో మహిళల భాగస్వామ్యం సుమారు 24 శాతంగా ఉంది.