ప్రజా సమస్యలపై చర్చలకు అడ్డుపడ్డ కాంగ్రెస్, బిఆర్ఎస్ 

ప్రజా సమస్యలపై చర్చలకు అడ్డుపడ్డ కాంగ్రెస్, బిఆర్ఎస్ 

అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా  బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అడ్డుకున్నాయని  మెదక్‌ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై స్పందిస్తూ‘‘నీవు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించారు’’ అంటూ విమర్శించారు. రెండు పార్టీల తీరు ఒకేలా ఉందని ఆరోపించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల్లో బీఆర్ఎస్‌ నేతల ఫాంహౌస్‌లకు వెళ్లడం అవసరమా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇది అధికార దుర్వినియోగమే తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. భూముల రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు మళ్లీ వాటిని పరిశీలించేందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

ప్రభుత్వ చర్యలపై ప్రజలు గమనిస్తున్నారని పేర్కొంటూ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ రెండు పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌కు గతంలో జరిగిన ఉప ఎన్నికలు కలిసొచ్చినట్లు ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో నిజాం పాలనపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాంను ప్రశంసించడం సరైన విధానం కాదని హితవు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిల గత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ చరిత్రను వక్రీకరించకూడదని ఆయన మండిపడ్డారు. 

బైరాన్‌పల్లి ఘటన, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఎంఐఎంకు అనుకూలంగా మాట్లాడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, తెలంగాణ అభివృద్ధి అంశాలపై బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని రఘునందన్ రావు పేర్కొన్నారు.