ఇరాన్‌పై యుద్ధం ఆరంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఓ ప్రాథమిక పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న దాడి సహా రెండు అమెరికా దాడులు యుద్ధ నేరాలై ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిజ నిర్ధారణ బృందం తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఈ రెండు దాడులలో 177 మంది పౌరులు మృతి చెందారు. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలు కూడా మానవత్వానికి వ్యతిరేక నేరాల పరిధిలోకి రావొచ్చని పేర్కొంది.
ఐరాస మానవ హక్కుల మండలికి సమర్పించనున్న ఈ నివేదికలోని అంశాలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వంటి న్యాయస్థానాల పరిశీలనకు ఉపయోగపడే అవకాశముంది. ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయ్యిబా ప్రాథమిక పాఠశాలపై అమెరికా దాడి జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఘటనలో 120 మంది చిన్నారులు, 26 మంది ఉపాధ్యాయులు సహా కనీసం 156 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.
అదే రోజు దక్షిణ ఇరాన్‌లోని లామెర్డ్ నగరంలో ఓ క్రీడా కేంద్రం, నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన మరో అమెరికా దాడిని కూడా ఐరాస బృందం పరిశీలించింది. ఈ ఘటనలో 22 మంది పౌరులు మరణించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ రెండు దాడులు పౌరుల ప్రాణనష్టం, గాయాలు లేదా పౌర ఆస్తుల విధ్వంసానికి దారితీసే విచక్షణారహిత దాడులకు అమెరికా పాల్పడి ఉండొచ్చని విశ్వసించేందుకు సహేతుకమైన ఆధారాలున్నాయని దర్యాప్తు బృందం పేర్కొంది.
మినాబ్ పాఠశాలపై దాడి ఘటనలో అమెరికా సైన్యం పొరపాటున పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. పక్కనే ఉన్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ స్థావరంపై దాడి చేయాలన్న లక్ష్యంతో అమెరికా సెంట్రల్ కమాండ్ పాత నిఘా సమాచారాన్ని ఉపయోగించిందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపినట్లు సీఎన్‌ఎన్ పేర్కొంది.
ఈ ఘటనపై అమెరికా అంతర్గత దర్యాప్తు ప్రాథమిక వివరాలను తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు మార్చిలో వెల్లడించిన సమాచారం ప్రకారం డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన కాలం చెల్లిన సమాచారంతోనే దాడికి సంబంధించిన లక్ష్య నిర్దేశక కోఆర్డినేట్లను సెంట్రల్ కమాండ్ రూపొందించింది. ఈ సమాచార లోపమే పాఠశాలపై దాడికి దారితీసిన పొరపాటుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.
ఇరాన్‌లోని లక్ష్యాలకు సంబంధించి నిఘా సమాచారంలో తీవ్ర కాలదోషం ఉందని కీలక డేటాబేస్‌లలో హెచ్చరికలు ఉన్నప్పటికీ సీనియర్ అమెరికా సైనిక కమాండర్లు వాటిని పట్టించుకోకుండా దాడులకు అనుమతించారని సీఎన్‌ఎన్ గతంలో కథనం ప్రచురించింది. పాఠశాలపై దాడి కూడా ఈ దాడుల్లో భాగమేనని పేర్కొంది. అమెరికా దాడులపై పరిశీలనతోపాటు యుద్ధం ప్రారంభానికి ముందు, 2025 చివరి నుంచి 2026 ఆరంభం వరకు ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరిగిన అణచివేతను కూడా ఐరాస నిజనిర్ధారణ బృందం తన నివేదికలో విశ్లేషించింది.
నిరసనలను అణచివేసే క్రమంలో వేలాది మంది మరణించారని, నిర్బంధంలో ఉన్నవారిని హింసించడంతోపాటు వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా అదృశ్యం చేశారని దర్యాప్తు బృందం పేర్కొంది. ఈ ఉల్లంఘనలు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల పరిధిలోకి రావొచ్చని అభిప్రాయపడింది. పౌరులపై విస్తృతమైన, వ్యవస్థీకృత దాడిగా ఈ అణచివేతను అభివర్ణించింది.
ఈ నివేదికను రూపొందించేందుకు స్వతంత్ర దర్యాప్తు బృందం ఉపగ్రహ చిత్రాలు, వీడియోలు, ఫొటోలు, విశ్వసనీయ సంస్థలు, నిపుణులు అందించిన సమాచారాన్ని విశ్లేషించింది. ఇరాన్‌లో, ఇరాన్ వెలుపల పలువురిని ఇంటర్వ్యూ చేసింది. ఇరాన్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్యాప్తు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని బృందం కోరినా అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు.
ఐరాస పంపిన సమాచార అభ్యర్థనల్లో కేవలం నాలుగో వంతుకు మాత్రమే ఇరాన్ స్పందించినట్లు నివేదిక తెలిపింది. అమెరికా ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు చేసిన అభ్యర్థనలకు, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి పంపిన సమాచార అభ్యర్థనలకు కూడా స్పందన రాలేదని పేర్కొంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సభ్యదేశం కానప్పటికీ అమెరికాకు సొంతంగా యుద్ధ నేరాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస నివేదికలోని అంశాలు, అమెరికా అంతర్గత దర్యాప్తు ఫలితాలు, భవిష్యత్తులో చేపట్టే న్యాయపరమైన చర్యలు కీలకంగా మారనున్నాయి.

More Stories
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలుగా క్రీడాకారులు
ఎస్ఐఆర్ లో లోపాలు గుర్తించిన జాబితాలో ఢిల్లీ సీఎం, మాజీ సీఎం
తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ!