తిరుమ‌ల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ!

తిరుమ‌ల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పవిత్ర శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత వివాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా జరిపిన సమగ్ర దర్యాప్తులో టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ( వాడినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. 

అయితే, ఈ విచారణలో నెయ్యి సరఫరాలో కొంత కల్తీ జరిగినట్లు మాత్రం అధికారులు నిర్ధారించారు. పంపిణీ చేసిన నెయ్యిలో కొద్దిపాటి రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలు వంటి కల్తీ పదార్ధాలు కలిపినట్లు దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. ఇక‌ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో పాటు పలువురు టిడిపి, జనసేన నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

ఈ విషయమై మొదటినుండి సంయమనంతో వ్యవహరిస్తున్న బిజెపి నాయకులు భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపే అంశాలపై తొందరపాటు వాఖ్యలు తగవని హితవు చెబుతూనే ఉన్నారు.  ఇప్పుడు ఈ నాయకులు చేసిన తీవ్ర ఆరోపణలు అవాస్తవమని తేలడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో వారిపై విమర్శల వర్షం కురుస్తోంది.  సిట్ దర్యాప్తులో నెయ్యిలో జంతు కొవ్వు వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవ్వడంతో, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి పవిత్రతతో చెలగాటమాడి, కోట్లాది మంది హిందూ భక్తుల విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారంటూ నెటిజన్లు, సామాజిక వేత్తలు కూటమి నేతల తీరును తప్పుపడుతున్నారు.

ఈ కేసులో సుకృతి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ కైలాష్‌చంద్‌ మాంగ్లాను తాజాగా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈనెల 17న అరెస్ట్ చేసిన ఈడీ విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచగా, అతడిని కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది.  క్రిమినల్‌ కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి వంటి ఆరోపణలతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా టీటీడీకి 2019 నుంచి 2024 మధ్య సుమారు రూ.230 కోట్ల విలువైన అనుమానాస్పద నెయ్యి సరఫరా జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 

 
ఈ సరఫరాల్లో సుమారు రూ.96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కైలాష్‌చంద్‌ మాంగ్లాకు చెందిన యూనిట్‌లోనే తయారు చేసినట్లు ఈడీ ఆరోపించింది. సుకృతి ఫుడ్స్‌ను కల్తీ నెయ్యి తయారీకి కేంద్రంగా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. రిఫైన్డ్‌ పామాయిల్‌, పామ్‌ కెర్నల్‌ ఆయిల్‌, పామోలిన్‌తో పాటు ఎంజీ-90, మోనోగ్లిజరైడ్స్‌, మైవాసెట్‌ సాఫ్ట్‌ 400, ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్‌ వంటి పదార్థాలు, రసాయనాలను ఉపయోగించి కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు ఈడీ వెల్లడించింది. 
 
అనంతరం దాన్ని అగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కౌ గీగా చూపించి టీటీడీకి సరఫరా చేసినట్లు ఆరోపించింది. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొనుగోళ్లు, విక్రయాలు, రవాణాకు సంబంధించిన తప్పుడు రికార్డులు, బిల్లులు సృష్టించినట్లు ఈడీ తెలిపింది. ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు, ఇతర సంస్థలకు విక్రయించినట్లు చూపిస్తూ నకిలీ దస్తావేజులను నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.