కృష్ణలంక పోలీసు హింసతోనే సాయికృష్ణ మృతి 

కృష్ణలంక పోలీసు హింసతోనే సాయికృష్ణ మృతి 
విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్‌లో చనిపోలేదని, పోలీసుల దాడుల్లో తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందినట్లు సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. ఈ కేసులో ఏ4 నిందితుడు గులివిందల సురేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించడంతో సురేష్‌ను నూజివీడు సబ్ జైలుకు తరలించారు.

ఈ ఏడాది మే 7న కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారణ పేరుతో అప్పటి సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణపై దాడి చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో ఉంచితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో సీఐ నాగరాజు ఆదేశాల మేరకు రాణిగారితోటలోని ఓ పాడుబడ్డ భవనానికి తరలించినట్లు సిట్ తెలిపింది.

మే 12న సీఐ నాగరాజును కలిసేందుకు సురేష్ వెళ్లిన సమయంలో రాణిగారితోటలోని ఖాళీ భవనంలో సాయికృష్ణను చూసినట్లు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఆ సమయంలో సాయికృష్ణ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడని, తనను చంపేందుకే కొడుతున్నారని సురేష్‌తో చెప్పినట్లు సిట్ తెలిపింది. సురేష్‌తో మాట్లాడుతున్న సమయంలోనే సాయికృష్ణ స్పృహ తప్పి పడిపోయి మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు.

అనంతరం ఘటనను కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి మోటార్ సైకిల్‌పై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించినట్లు సిట్ వెల్లడించింది. అక్కడ సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, సురేష్ కలిసి మృతదేహాన్ని దహనం చేసినట్లు పేర్కొంది. 

మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు ముగ్గురూ అక్కడే ఉన్నారని, మే 18న సురేష్ మళ్లీ శ్మశానవాటికకు వెళ్లి ఏమైనా ఆనవాళ్లు మిగిలాయా అని పరిశీలించినట్లు సిట్ తెలిపింది. అలాగే సీఐ నాగరాజు ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ సాయికృష్ణ కస్టడీలో ఉన్న సమయంలో తీసిన ఫొటోలను తొలగించినట్లు నివేదికలో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలు లభించకుండా ప్రయత్నాలు చేసినట్లు సిట్ వెల్లడించింది.

ఏ1 నిందితుడు సీఐ నాగరాజుకు ఏ4 సురేష్ సన్నిహితుడని, ఆయనతో కలిసి నైట్ రౌండ్స్‌కు కూడా వెళ్లేవాడని సిట్ పేర్కొంది. మే 7న సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని సాయికృష్ణను విచారిస్తున్న సమయంలో సురేష్ అక్కడే ఉన్నట్లు రిమాండ్ నివేదికలో వెల్లడించింది.