టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా
టాటా సన్స్‌లో నెలల తరబడి కొనసాగుతున్న వివాదాలు గురువారం ఒక కొత్త మలుపు తిరిగాయి. కంపెనీలో 66 శాతం వాటా కలిగిన ‘టాటా ట్రస్ట్స్’ చైర్మన్ “చట్టవిరుద్ధం” అని పేర్కొన్న ఒక కీలక నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ప్రకటించడమే ఇందుకు కారణం. 63 ఏళ్ల ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారా లేదా? డజన్ల కొద్దీ రంగాలు,  పరిశ్రమలలో విస్తరించి ఉన్న టాటా కంపెనీలకు మాతృ సంస్థ (ప్రైవేట్ హోల్డింగ్ కంపెనీ)  ‘టాటా సన్స్’, తన శతాబ్ద కాలపు పనితీరును మార్చుకుని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావాలా (పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారాలా) లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా వ్యతిరేకించినప్పటికీ, టాటా సన్స్ బోర్డు గురువారం నాడు హోల్డింగ్ కంపెనీ ఛైర్మన్‌గా  “మెజారిటీ ఓట్ల”తో చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు తిరిగి నియమించినట్లు టాటా సన్స్ బోర్డు ప్రకటించింది. అలాగే, కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే దిశగా అడుగులు వేస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మార్గదర్శకాలను పాటించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా బోర్డు నిర్ణయించింది. 
 
కానీ, ట్రస్ట్స్ చైర్మన్‌గా ఉన్న నోయెల్ టాటా ఈ పునర్నియామకాన్ని “చట్టవిరుద్ధం” అని పేర్కొంటూ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఓటు వేసినట్లు తెలిపారు. ప్రత్యేకమైన పరోపకార నమూనాను కలిగిన ఈ ప్రైవేట్ కంపెనీ స్వభావాన్ని మార్చివేస్తుందని వాదిస్తూ, పబ్లిక్ లిస్టింగ్ ఆలోచనను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
 
ఈ సందర్భంగా, నోయెల్ టాటా రెండు ప్రధాన అంశాలను టాటా ట్రస్ట్స్ ప్రకటన ద్వారా, బోర్డుకు సమర్పించిన లేఖ ద్వారా తెలియజేశారు. ఫిబ్రవరి 2027లో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరో పదవీకాలానికి పోటీ చేయకూడదని చైర్మన్ చంద్రశేఖరన్ గత నెలలో స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఉదహరించారు. 
 
ఆగస్టు 12, 2026 నాటి చంద్రశేఖరన్ లేఖ గురించి మాట్లాడుతూ, నోయెల్ టాటా బోర్డుతో ఇలా పేర్కొన్నారు: “అటువంటి సమాచారం ఒకసారి బహిరంగమైతే, దాని పర్యవసానాలను ఈ బోర్డు తర్వాత మార్చలేదు. గ్రూప్ ఉద్యోగులు, దాని రుణదాతలు, దాని ప్రత్యర్ధులు, మార్కెట్ అందరూ దానిపై చర్య తీసుకున్నారు. అలాగే, మెజారిటీ వాటాదారు కూడా. అధ్యాయం ముగిసింది,” అని ఆయన బోర్డుకు రాశారు. 
 
చైర్మన్ చంద్రశేఖరన్‌తో సహా బోర్డులో ఆరుగురు సభ్యులు ఉన్నారు. కంపెనీలో మూడింట రెండు వంతుల వాటా ఉన్నందున వారిలో కనీసం ఇద్దరిని టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసింది. తన రెండవ వాదనగా, నోయెల్ టాటా ఒక చట్టపరమైన అంశాన్ని ఉదహరించారు. చైర్మన్‌ను నియమించే ప్రక్రియలో, టాటా సన్స్ బోర్డులోని టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్లలో మెజారిటీ మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
 
“ట్రస్ట్ నామినీ డైరెక్టర్లలో ఒకరైన నోయల్ టాటా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేసినందున, అది చట్టబద్ధంగా చెల్లనిదిగా, ఎటువంటి ఆధారం లేనిదిగా పరిగణించబడింది,” అని టాటా ట్రస్ట్స్ ప్రకటనలో పేర్కొంది. టాటా ట్రస్ట్స్ నుండి నామినీ అయిన మరో డైరెక్టర్, దాని వైస్-ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. అంటే, టాటా సన్స్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలపై టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసిన ఈ ఇద్దరు డైరెక్టర్లు ఏకీభవించలేదని అర్థం.
 
కాగా, 2027 ఫిబ్రవరి 20న తన ప్రస్తుత పదవీకాలం ముగిసినప్పుడు, తాను మరోసారి పోటీ చేయబోనని చంద్రశేఖరన్ ఆగస్టులో ప్రకటించారు. బోర్డు తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఆ గమనాన్ని తిప్పికొట్టి, చంద్రశేఖరన్ కొనసాగింపు ప్రశ్నను నేరుగా వాటాదారుల ముందు ఉంచింది.  టాటా ట్రస్ట్‌లు సమిష్టిగా టాటా సన్స్‌లో సుమారు 66% వాటాను కలిగి ఉండటం, చారిత్రాత్మకంగా హోల్డింగ్ కంపెనీ కూర్పుపై గణనీయమైన ప్రభావాన్ని చూపడం వల్ల ఈ అంశం ప్రత్యేకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
 
చంద్రశేఖరన్ కొనసాగింపుపై ఉన్న ఈ విభేదాలు, టాటా గ్రూప్‌లోని విస్తృత పాలనాపరమైన పోరాటంలో ఒక భాగం. మూలధన కేటాయింపు, గ్రూపులోని కొన్ని అన్లిస్టెడ్ వ్యాపారాలలో నష్టాలు, టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణంపై ఆందోళనల కారణంగా గతంలో విభేదాలు తలెత్తాయి. 2026 ఆర్ధిక సంవత్సరంలో ఎనిమిది ప్రధాన అన్లిస్టెడ్ టాటా కంపెనీలు కలిసి సుమారు రూ. 33,538 కోట్ల నష్టాలను చవిచూడగా, ఇందులో ఎయిర్ ఇండియా వాటా రూ. 22,238 కోట్లు, టాటా డిజిటల్ వాటా రూ. 4,974 కోట్లు. టాటా సన్స్‌ను పబ్లిక్ లిస్టింగ్ వైపు నెట్టిన ఆర్‌బిఐ ఆదేశం నేపథ్యంలో కూడా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
 
సెప్టెంబర్ 11న, తమ రిజిస్ట్రేషన్‌ను వదులుకుని, రిజిస్టర్ కాని కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా కొనసాగాలన్న టాటా సన్స్ దరఖాస్తును ఆర్‌బిఐ తిరస్కరించింది. దానికి బదులుగా, వర్తించే నియంత్రణ అవసరాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గురువారం జరిగిన సమావేశంలో, ఆర్‌బిఐ ఆదేశానికి అనుగుణంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే టాటా సన్స్‌ను లిస్టింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియతో ముందుకు సాగాలని బోర్డు నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. 
 
లిస్టింగ్ అంశం టాటా ట్రస్ట్‌లను విభజించింది. నోయల్ టాటా, కొంతమంది మాజీ టాటా సన్స్ డైరెక్టర్లు హోల్డింగ్ కంపెనీని పబ్లిక్‌గా మార్చడాన్ని వ్యతిరేకించగా, ఇతర ట్రస్టీలు — శ్రీనివాసన్, విజయ్ సింగ్ — ఈ చర్యకు మద్దతు తెలిపారు. టాటా సన్స్‌లో సుమారు 18.37% వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజి గ్రూప్ కూడా లిస్టింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే, తక్షణ అడ్డంకి టాటా సన్స్ ఏజీఎం.
 
టాటా సన్స్‌లో 23.56% వాటా కలిగిన సర్ రతన్ టాటా ట్రస్ట్ పై ఉన్న నియంత్రణ ఆంక్షల కారణంగా, సమావేశానికి తమ ప్రతినిధిని నామినేట్ చేయడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. దీంతో, ఆగస్టు 18న జరగాల్సిన వార్షిక సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. అసోసియేషన్ ఆర్టికల్స్ ప్రకారం, సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్,  రతన్ టాటా ట్రస్ట్ సంయుక్తంగా నామినేట్ చేసిన అధీకృత ప్రతినిధితో కోరం ఏర్పడాలి. 
 
ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాల సమాచారం ప్రకారం, వార్షిక సాధారణ సమావేశంలో (ఎజిఎం) చంద్రశేఖరన్ పదవీకాలం కొనసాగింపును టాటా ట్రస్ట్స్ సవాలు చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 31లోపు నిర్వహించాల్సిన ఈ వాయిదా పడిన ఎజిఎం అత్యంత కీలకం.ఎందుకంటే, టాటా సన్స్ డైరెక్టర్‌గా చంద్రశేఖరన్ ‘రొటేషన్’ పద్ధతిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది, కాబట్టి డైరెక్టర్‌గా ఆయనను తిరిగి నియమించడానికి వాటాదారుల ఆమోదం అవసరం అవుతుంది.
 
చంద్రశేఖరన్‌ను డైరెక్టర్‌గా తిరిగి నియమించడానికి ఎజిఎంలో ఆమోదం లభించడం  చాలా కీలకం, ఎందుకంటే ఆయన ఛైర్మన్‌గా కొనసాగాలంటే టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా కూడా ఉండాలి. అందువల్ల, ఈ తీర్మానం టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్‌ల మధ్య తదుపరి ప్రధాన వివాదాంశంగా మారవచ్చు. నోయెల్ టాటా, ట్రస్ట్‌లు ఎజిఎంలో ఈ తీర్మానాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది, తద్వారా ఈ వాటాదారుల సమావేశం టాటా సన్స్‌లోని అధికార సమతుల్యతకు ఒక నిర్ణయాత్మక పరీక్షగా మారే అవకాశం ఉంది.