యుపిఐ చార్జీలపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి

యుపిఐ చార్జీలపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
* పార్లమెంటరీ కమిటీలో మౌనం…. ఇప్పుడేమో అమెరికాకు దాసోహం అంటూ విమర్శలు 
 
యూపీఐ లావాదేవీల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) విధానానికి రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో, ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సభ్యులుగా ఉన్న పార్లమెంటరీ ఆర్థిక స్థాయీ సంఘం సిఫార్సు చేసిన ఆదాయ నమూనాను కాంగ్రెస్ నాయకుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ వర్గాలు ప్రశ్నించాయి. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు — మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, మనీష్ తివారీ, గౌరవ్ గోగోయ్, కిషోరీ లాల్ మరియు కె. గోపీనాథ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
 
ఆగస్టు 12న నివేదికను ఆమోదించినప్పుడు వారు హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్‌లో ఎటువంటి వ్యతిరేకత నమోదు కాలేదని ఆ వర్గాలు తెలిపాయి. “మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, మాజీ యూపీఏ మంత్రి మనీష్ తివారీతో సహా తన సొంత ఎంపీలే పార్లమెంటులో మద్దతు ఇచ్చిన దాన్ని రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?” అని బీజేపీ వర్గాలు ప్రశ్నించాయి. 
 
యూపీఐ కోసం శ్రేణీకృత ఎం.డి.ఆర్/రెవెన్యూ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ గట్టిగా కోరింది. దీనిని ఆలస్యం లేకుండా నోటిఫై చేసి, అమలులోకి తీసుకురావాలని కూడా పేర్కొంది. బీజేపీకి చెందిన భర్తృహరి మహతాబ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, యూపీఐ ఎకోసిస్టమ్ కోసం కేటాయించిన రూ. 2,000 కోట్ల బడ్జెట్‌కు, పరిశ్రమ అంచనా వేసిన రూ. 20,700 కోట్ల నిర్వహణ వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆందోళన వ్యక్తం చేసింది. 
 
యూపీఐ చెల్లింపులపై ఛార్జీ విధించాలని కోరిన పార్లమెంట్ ప్యానెల్‌లోని 5 మంది కాంగ్రెస్ ఎంపీలు, విభేదించలేదు. అయితే, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు  యుపిఐ ఛార్జీని “ప్రజా వ్యతిరేకం”గా అభివర్ణించి, దానిని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా అమెరికాకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాగా, ఎవరి పేరు ప్రస్తావించకుండా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తోసిపుచ్చింది. ఈ నిర్ణయం స్వతంత్రంగా తీసుకున్నామని స్పష్టం చేసింది. 
 
ఎండిఆర్ అనేది పన్ను కాదని, దీని భారాన్ని వినియోగదారులు నేరుగా మోయాల్సిన అవసరం లేదని కేంద్రం వాదిస్తోంది. ఈ రాజకీయ వివాదం కారణంగా, సుస్థిరమైన యుపిఐ ఆదాయ నమూనా కోసం పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన సిఫార్సు ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాంధీ దీనిని వ్యతిరేకిస్తుండగా, ఆ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారన్న విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తుంది.