ప్రముఖ కన్నడ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్ కు కేంద్ర ప్రభుత్వం భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవంలో అనంత్ నాగ్ ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అందుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపారు. అద్భుతమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో, ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ గౌరవానికి ఆయన అన్ని విధాలా అర్హులని ప్రధాని పేర్కొన్నారు.
1948 సెప్టెంబర్ 4న జన్మించిన అనంత్ నాగ్ (అనంత్ నాగర్కట్టె) తన సుదీర్ఘ కెరీర్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో 250కి పైగా కన్నడ చిత్రాలే ఉన్నాయి. ఆయన కన్నడతోపాటు హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపైనే కాకుండా ఆర్కే నారాయణ్ కథల ఆధారంగా దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మించిన ఊటె, హంసగీతె, కవలుదారి, సర్కారీ హిరియ ప్రాథమిక పాఠశాలె కాసరగోడ్, రాజకుమార, యాన, ఆయుష్మాన్ భవ.. వంటి అనేక చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. నేటి తరం యువ ప్రేక్షకులకు కూడా తన నటనతో బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్: చాప్టర్ 1లో సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ ఇంగలగి పాత్ర ఆయనకు తెచ్చిపెట్టిన ప్రజాదరణ అంతా ఇంతా కాదు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ హిస్టరీ, రాకీ భాయ్ ఎదుగుదలను వివరించే సూత్రధారిగా ఆయన చెప్పిన సంభాషణలు, గంభీరమైన స్వరం.. సినిమా మొత్తానికీ హైలైట్. అలాగే తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్రను పోషించారు
తన నటనకుగాను ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు అందుకున్న అనంత్ నాగ్‌ను గత ఏడాది భారత ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేస్తున్న సేవలకు ఫాల్కే అవార్డు సరైన గౌరవమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు మొహన్లాల్, మిథున్ చక్రవర్తి, వహీదా రెహమాన్, ఆశా పరేఖ్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, కె. విశ్వనాథ్ తదితర ప్రముఖులకు ఈ పురస్కారం లభించింది.

More Stories
ఛత్తీస్‌గఢ్‌లో 29 మందిని చంపిన మావోయిస్టులకు 10 మందికి మరణ శిక్ష
సెన్సార్ బోర్డులో ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి
షాజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థ