కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు సిఎం రేవంత్ ఆదేశం

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు సిఎం రేవంత్ ఆదేశం
గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని,  విచారణ జరపకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు ఎస్సీలను యజమానులుగా చేస్తామని ప్రకటించారు. 
 
అసెంబ్లీలో 22ఏ అంశంపై చర్చ సందర్భంగా కేసీఆర్‌ కుటుంబ భూములు వివరాలు వెల్లడిస్తూ  చరిత్రలో ప్రజల కోసం పోరాటాలు చేసినవారు తమ ఆస్తులను కోల్పోతే.. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొంటున్న కేసీఆర్‌ మాత్రం రూ.లక్ష కోట్ల విలువైన భూములను దోచుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం పేరిట 9 జిల్లాల్లో 24 మండలాల్లోని 31 గ్రామాల్లో 440 ఎకరాల భూమి ఉందన్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్‌ చెప్పాలన్నారు. ఇవే కాకుండా బినామీల పేరుతో వందల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు.
 
గత ప్రభుత్వంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందా లేదా తేల్చాలని స్పష్టం చేశారు. 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతానని, శుద్ధి చేసిన చోటే దళితులకు భూములిచ్చి యజమానులను చేస్తానని ఘంటాపథంగా చెప్పారు.

“సిద్దిపేటలో కేసీఆర్‌ కుటుంబానికి 67.5 ఎకరాలు ఉంది. కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు ఉంది. హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు ఉంది. జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు ఉంది. నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాలోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాలున్నాయి” అని ముఖ్యమంత్రి వివరించారు. 

మొత్తం రూ.లక్ష కోట్ల భూకుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూకుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (ఎస్‌ఈటీ), మొత్తం భూకుంభకోణంపై నెలరోజుల్లో నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చెప్పింది ధరణి పార్ట్‌- 1 మాత్రమేనని, త్వరలోనే ధరణి పార్ట్‌-2 అక్రమాలు బయటపెడతామని వెల్లడిచారు.  

సత్యం స్కాంలో ఉన్న భూముల్లోనే కేటీఆర్‌ ఫాంహౌస్‌ ఉందని పేర్కొంటూ  సత్యం స్కాంలో ఉన్న భూములు కేటీఆర్‌ బంధువుల పేరుతో బదిలీ అయ్యాయని ఆరోపింఛారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్‌ రావు ఫాంహౌస్‌కు రోడ్లు వేయించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌కు తీసుకున్న భూమిలోనే హరీశ్ రావు ఫాంహౌస్‌ ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ బాలానగర్‌లో 120 ఎకరాలను హరీశ్ రావు కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు భయపడుతున్నారని పేర్కొన్నారు.

 కాగా, “మా ఆస్తులు, రేవంత్‌ రెడ్డి ఆస్తులు నీ తమ్ముళ్ల ఆస్తులు ఎట్ల పెరిగినయ్‌.అన్నింటి మీద సిట్టింగ్ జడ్జితో మేం ఎంక్వైరీకి సిద్దం.  నువ్వు రెడీనా?” అని  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సవాల్ విసిరారు. 

“ఇయ్యాళ్ల కేటీఆర్‌ మీద, నా మీద, మా నాయకుల మీద ఇన్ని ఆరోపణలు చేశావు కదా. బీఆర్‌ఎస్ హయాంలో ధరణి విషయంలో కావొచ్చు. లేదు కాంగ్రెస్‌ వచ్చిన డిసెంబర్‌ 7 2023 నుంచి ఈ రోజు వరకు భూభారతి వరకు నీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో, మా హయాంలో ఏం జరిగినయో మొత్తం మేం విచారణకు సిద్దం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా.? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా?  సుప్రీం కోర్డు సిట్టింగ్‌ జడ్జితో చేయిద్దాం” అని స్పష్టం చేశారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక రేవంత్ రెడ్డి డైవర్షన్‌ డ్రామాకు దిగుతున్నారని విమర్శించారు.  మొత్తం రేవంత్‌ రెడ్డి అబద్దాలు, అర్థ సత్యాలు చెప్పి ఒక డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపారని, ఆయన మాట్లాడినవన్నీ కూడా పచ్చి అబద్దాలని ఆరోపించారు.  “మేం సభలో ఉంటే మీ బండారాన్ని బయటపెడతామని, మీ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని, నీ తమ్ముడి కుంభకోణాలు బయటపెడతామని, నీ కుటుంబ కుంభకోణాలన్నీ బయటకొస్తాయని సభ నుంచి సస్పెండ్ చేసింది నువ్వు కదా?” అని ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తే ఒక్క రోజు చేయొచ్చు కదా, మొత్తం సెషన్‌కు ఎందుకు చేసినవ్‌ అని నిలదీశారు.  

మరోవంక, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన భూకబ్జాలను బయటపెట్టడానికి రేవంత్‌ రెడ్డికి వెయ్యి రోజులు పట్టిందా? అని  కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ మధ్య డీల్‌ కుదరలేదా? ఏఐసీసీకి ఈఎంఐ కట్టడం ఇబ్బందిగా ఉందా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌లో పనిచేసిన సుమారు 90 మంది ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ డ్రగ్స్‌, ఈ-ఫార్ములా, ఫోన్‌ ట్యాపింగ్‌, ఫామ్‌హౌస్‌ కేసుల దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. ఈ కేసులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఏం చేస్తోందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.