యుపిఐ చార్జీలతో భారత్ తిరిగి నగదు వైపు మళ్లే ప్రమాదం!

యుపిఐ చార్జీలతో భారత్ తిరిగి నగదు వైపు మళ్లే ప్రమాదం!
 
* రిటైల్ వ్యాపారస్తులు ఆందోళన.. 4 శాతం లావాదేవీలపై మాత్రమే ప్రభావం అంటున్న ప్రభుత్వం   
 
రూ. 2,000 దాటిన కొన్ని యూపీఐ లావాదేవీలపై విధించిన కొత్త ఛార్జీపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం భారతదేశం తిరిగి నగదు ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లే ప్రమాదాన్ని కలిగి ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) పేర్కొంది. “చిన్న వ్యాపారులు ఇప్పుడు నగదును స్వీకరించాలా లేక యూపీఐని స్వీకరించాలా అని రెండుసార్లు ఆలోచిస్తారు,” అని వ్యవస్థీకృత రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసోసియేషన్ సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఇలాంటి వ్యాపారులు తరచుగా చాలా తక్కువ లాభాలతో పనిచేస్తారని, చిన్న ఛార్జీ కూడా యూపీఐ చెల్లింపులను అంగీకరించే వారి సుముఖతను ప్రభావితం చేస్తుందని రాజగోపాలన్ స్పష్టం చేశారు. యూపీఐ వ్యవస్థ ఆరేళ్లపాటు ఉచితంగా ఉండటంతో, దానిని వేగంగా స్వీకరించడానికి ప్రోత్సాహం లభించింది. అయితే, వినియోగదారులకు అన్ని లావాదేవీలు ఉచితంగానే ఉంటాయని, కానీ రూ. 2,000 దాటిన కొన్ని చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) వర్తిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మంగళవారం ప్రకటించింది.
 
రూ. 2,000 దాటిన వినియోగదారు-వ్యాపారి లావాదేవీలపై 0.4% రుసుము (సుమారుగా రూ. 2,001 మొత్తానికి రూ. 8) ఉంటుంది. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి రంగాలకు రూ. 5 చొప్పున స్థిర రుసుము ఉంటుంది. వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకు లావాదేవీలు అందుకునే చిన్న వ్యాపారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించరు.
 
రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) ఈ విషయాన్ని ఎన్‌పీసీఐ,  ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్తుందని, డెబిట్, క్రెడిట్ అనుసంధానిత యూపీఐ లావాదేవీలను వేరుచేసే శ్రేణీకృత నిర్మాణం కోసం ఒత్తిడి చేస్తుందని రాజగోపాలన్ తెలిపారు. ఎండీఆర్ భారం లావాదేవీలను తిరిగి నగదు వైపు మళ్లించడానికి ప్రోత్సాహాన్ని సృష్టిస్తుందని సీఈఓ నొక్కి చెప్పారు. ఈ ఛార్జీ ప్రభుత్వ అధికారికీకరణ అజెండాకు విరుద్ధమని చెబుతూ సాధారణ యూపీఐ లావాదేవీల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆయన కోరారు. 
 
క్లోతింగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎంఏఐ) అధ్యక్షుడు సంతోష్ కటారియా, ఈ నిర్ణయం తీసుకున్న సమయాన్ని ప్రశ్నిస్తూ, దీపావళికి కేవలం కొన్ని వారాల ముందు, అక్టోబర్ 15న ఈ కొత్త ఛార్జీ అమల్లోకి వస్తుందని ఎత్తి చూపారు. “పండుగ సీజన్ ప్రారంభంలో యుపిఐపై ఎండిఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను ప్రవేశపెట్టడం అనేది ఈ రంగానికి అత్యంత క్లిష్టమైన సమయంలో జరిగింది. 
 
డిమాండ్‌ను పునరుద్ధరించడానికి, లాభాలను పెంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్న వ్యాపారులు, చిల్లర వర్తకులు, వినియోగదారులకు సేవలు అందించే వ్యాపార సంస్థలకు ఈ సమయం చాలా కీలకం. ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఈ వ్యవస్థపై, ఈ తరుణంలో డిజిటల్ లావాదేవీల కోసం అదనపు ఖర్చును భారం చేయడం ప్రమాదకరం. 
వినియోగాన్ని, ఆర్థిక వ్యవస్థను అధికారిక పరిధిలోకి తీసుకురావడంలో యుపిఐ శక్తివంతమైన పాత్ర పోషించింది.  కాబట్టి, చెల్లింపులను స్వీకరించే ఖర్చును పెంచే ఏ చర్య అయినా – ముఖ్యంగా ఏడాదిలో అత్యంత కీలకమైన అమ్మకాల సమయంలో – చాలా జాగ్రత్తగా నిర్ణయించాలని ఆయన కోరారు. 
 
ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున స్థిరమైన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) చెల్లించాల్సి వస్తే ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న తమ లాభాలపై అది మరింత భారం మోపుతుందని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ పంప్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేసి, కేవలం నగదు లావాదేవీలకే పరిమితం అవుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
నగదు రహిత చెల్లింపుల విధానాన్ని వ్యాపారులు మొదట్లో సమర్థించినప్పటికీ, ఇప్పుడు నగదు లావాదేవీల వైపు మళ్లుతామని ఢిల్లీలోని కమ్లా నగర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నితిన్ గుప్తా పేర్కొన్నారు. “మేము ఇప్పటికే లావాదేవీల ఛార్జీలు, 18 శాతం జిఎస్టి చెల్లిస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం యుపిఐ ఎండిఆర్  పేరుతో ఛార్జీలు విధిస్తే, మేము నగదు లావాదేవీలనే ప్రోత్సహిస్తాముమేము లావాదేవీల ఛార్జీలను ఎందుకు చెల్లించాలి? ” అని స్పష్టం చేశారు. 
 
ఎండిఆర్   వల్ల కేవలం 4 శాతం లావాదేవీలు మాత్రమే
 
కాగా, ఎండిఆర్  వల్ల కేవలం 4 శాతం లావాదేవీలు మాత్రమే ప్రభావితమవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. “ప్రవేశపెట్టిన కొత్త  యుపిఐ విధానం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలపై (పి2పి) ఎటువంటి ప్రభావం చూపదు. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా, వ్యక్తుల మధ్య జరిగే అన్ని లావాదేవీలకు యుపిఐ పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుంది” అని తెలిపింది. 
 
“రూ. 2,000 వరకు వ్యాపారులకు చేసే చెల్లింపులు, అలాగే చిన్న వ్యాపారుల కోసం ‘జీరో- ఎండిఆర్  విధానం పరిధిలోకి వచ్చే లావాదేవీలు కూడా ఉచితంగానే ఉంటాయి. తత్ఫలితంగా, దాదాపు 96 శాతం పి2ఎం (వ్యక్తి నుండి వ్యాపారికి) లావాదేవీలు ప్రభావితం కావు.  ఎండిఆర్  అనేది కేవలం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది,” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఎండిఆర్   అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ  వసూలు చేసే పన్ను లేదా ఛార్జీ కాదని స్పష్టం చేయడమైనది.  యుపిఐ వ్యవస్థ నిర్వహణ, విస్తరణకు మద్దతుగా, బ్యాంకులు, పేమెంట్ అప్లికేషన్ ప్రొవైడర్లతో సహా చెల్లింపు వ్యవస్థలో భాగస్వాములైన సంస్థల మధ్య ఇది పంపిణీ జరుగుతుందని అది వివరించింది.  ఎండిఆర్  ను ప్రవేశపెట్టాలనే నిర్ణయం ఐదేళ్ల క్రితమే, సమగ్రంగా ఆలోచించి తీసుకున్నదని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 
 
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అవి స్పష్టం చేశాయి. “డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పడిన తర్వాత  ఎండిఆర్  విధించాలని ఐదేళ్ల క్రితమే నిర్ణయించారు. దీనివల్ల సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదు, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించబోము,” అని స్పష్టం చేశాయి. 
 
 ఇంకోవైపు, యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన ఎండీఆర్‌ విధానం సుప్రీంకోర్టుకు చేరింది. రూ.2 వేలకుపైబడిన నిర్దిష్ట పర్సన్‌-టు-మర్చంట్‌ (పీ2ఎం) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధించడాన్ని సవాలు చేస్తూ అడ్వకేట్‌ అంజన్‌ దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కొత్త విధానం చట్టబద్ధత, మర్చంట్‌ లావాదేవీలపై రుసుము విధించే విధానం వంటి అంశాలను పిటిషన్‌లో సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌తో యూపీఐ ఛార్జీల అంశం ఇప్పుడు న్యాయపరమైన పరిశీలనకు వెళ్లింది.