రష్యా నుంచి చమురు దిగుమతిపై 100 శాతం అమెరికా సుంకాలు?

రష్యా నుంచి చమురు దిగుమతిపై 100 శాతం అమెరికా సుంకాలు?
రష్యాపై ఆంక్షలు విధించే బిల్లులో భారత్ పేరును చేర్చాలని అమెరికా చట్టసభ్యులు సవరణను ప్రవేశపెట్టారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించే ప్రతిపాదన ఇందులో ఉంది. భారత్, చైనా సహా పలు దేశాలను ఈ జాబితాలో చేర్చాలని డెమోక్రటిక్ సభ్యుడు స్టెనీ హోయర్ ప్రతిపాదించారు. 
 
‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్’కు అమెరికా సెనేట్ ఆగస్టు 7న 8, 6-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. రష్యా నాయకత్వం, ఇంధన రంగంపై ఆంక్షలతో పాటు, ఆంక్షలను తప్పించుకుంటూ చమురు రవాణా చేసే ‘షాడో ఫ్లీట్’ నౌకలపైనా చర్యలు తీసుకునేలా బిల్లు రూపొందించారు.   ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా చేస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న అమెరికా, ఇప్పుడు ఆ దేశం నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై కూడా ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోంది. 
 
ఇందులో భాగంగా అమెరికా సెనేట్‌లో తాజా సవరణను ప్రవేశపెట్టారు.  ప్రస్తుత బిల్లులో రష్యా చమురు కొనుగోలు దేశాల పేర్లు నేరుగా పేర్కొనలేదు. అయితే చమురు, సహజవాయువును అధికంగా దిగుమతి చేసుకునే ఐదు దేశాల ప్రస్తావన ఉంది.  తాజాగా హోయర్ ప్రవేశపెట్టిన సవరణలో భారత్, చైనా, టర్కియే, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవాక్ రిపబ్లిక్, యూఏఈ, సింగపూర్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్‌లను 100 శాతం సుంకాలకు అర్హమైన దేశాలుగా పేర్కొన్నారు.  
 
దీంతో రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలను ఆ దేశం నుంచి దూరం చేయడం అమెరికా లక్ష్యంగా కనిపిస్తుంది.  సవరణలోని సెక్షన్ 113 ప్రకారం, చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా సంబంధిత దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకం విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఈ సుంకం ఇప్పటికే ఉన్న ఇతర డ్యూటీలు, పన్నులు, ఫీజులకు అదనంగా ఉంటుందని సవరణలో స్పష్టం చేశారు. 
 
అయితే అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేకంగా వెయివర్ ఇచ్చే అధికారం కూడా ఈ చట్టంలో ఉంది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తే, కొన్ని ఆంక్షలు, పరిమితులు లేదా టారిఫ్‌లను మినహాయించే అవకాశం ఉంటుంది. ఇందుకు కాంగ్రెస్‌కు లిఖితపూర్వకంగా కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది.అదేవిధంగా అమెరికాలో ప్రవేశించే రష్యా వస్తువులపై 500 శాతం వరకు సుంకాలను విధించే అధికారం అధ్యక్షునికి కల్పించారు. 
కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు, దిగుమతి సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఫైనల్​ ఓటింగ్ నిర్వహించనుంది.