రూ.3.93 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న ఆర్‌బీఐ

రూ.3.93 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న ఆర్‌బీఐ

బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన అదనపు ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు ఆర్‌బీఐ తాజాగా నిర్వహించిన ‘వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (విఆర్ఆర్ఆర్ఆర్)’ వేలం ద్వారా రూ.3,93,352 కోట్లను వెనక్కి తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నిధులను తగ్గించి, మనీ మార్కెట్ రేట్లను రెపో రేటుకు అనుగుణంగా ఉంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.

ఈ వేలం కోసం ఆర్‌బీఐ రూ.5 లక్షల కోట్ల నోటిఫైడ్ మొత్తాన్ని ప్రకటించగా బ్యాంకుల నుంచి రూ.3,93,352 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. వచ్చిన బిడ్లన్నింటినీ ఆర్‌బీఐ ఆమోదించింది. ఈ నిధులను 5.24 శాతం కటాఫ్, వెయిటెడ్ యావరేజ్ రేటుతో స్వీకరించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 11 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత సుమారు రూ.10.73 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

బ్యాంకులు ఇటీవల భారీగా ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ) డిపాజిట్లను సమీకరించడమే ఈ అదనపు నగదుకు ప్రధాన కారణంగా తెలుస్తున్న‌ది. ఈ డిపాజిట్ల ద్వారా వచ్చిన విదేశీ కరెన్సీని బ్యాంకులు ఆర్‌బీఐతో స్వాప్ చేసుకోవడంతో వాటికి పెద్ద మొత్తంలో రూపాయి ద్రవ్యం అందుబాటులోకి వచ్చింది.  ఈ అదనపు నిధులను నియంత్రించేందుకు గత నెల నుంచి ఆర్‌బీఐ వరుసగా వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలాలను నిర్వహిస్తున్న‌ది.

వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలంతోపాటు అదనపు ద్రవ్యాన్ని మరింత సమర్థంగా నియంత్రించేందుకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కింద రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనుంది. మూడు విడతల్లో ఈ అమ్మకాలు జరగనున్నాయి. మొదటి విడతలో భాగంగా సెప్టెంబర్ 17న రూ.50,000 కోట్ల విలువైన సెక్యూరిటీలను విక్రయిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 21, 28 తేదీల్లో రూ.25,000 కోట్ల చొప్పున రెండు విడతల్లో వేలాలు జరుగుతాయి. ఇదే నెల ఆరంభంలో నిర్వహించిన ఓవర్ నైట్ వీఆర్‌ఆర్‌ఆర్‌ వేలంలో కూడా ఆర్‌బీఐ రూ.3.53 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించింది.

ఆర్బీఐ చేపట్టిన ఈ చర్యల ప్రభావం గృహ రుణాలు పొందిన సాధారణ రుణగ్రహీతలపై నేరుగా పడనుంది. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ఒకేసారి రూ. 1 లక్ష కోట్లు బయటకు వెళ్లడం వల్ల బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ నిధుల లభ్యత తగ్గి, నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది. ఈ అదనపు వ్యయాన్ని భర్తీ చేసుకోవడానికి బ్యాంకులు రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీని ఫలితంగా గృహ రుణాలు తీసుకున్న వారిపై నెలవారీ ఈఎంఐ భారం పెరగడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో బ్యాంకులు రుణ చెల్లింపు కాలపరిమితిని కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి.