భారత్ తో సంబంధాల పట్ల బంగ్లాదేశ్ ఉదాసీన వైఖరి!

భారత్ తో సంబంధాల పట్ల బంగ్లాదేశ్ ఉదాసీన వైఖరి!
బంగ్లాదేశ్ సరిహద్దులను పంచుకుంటున్న ఏకైక దేశం భారత్. పైగా, నదీజలాలు, విద్యుత్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు భారత్ నుండి సమకూర్చుకోవలసి ఉంది. అంతేకాకుండా నిత్యం లక్షలాది మంది ఆ దేశం పరులు వైద్యం, విద్య, ఇతరత్రా అవసరాలకోసం భారత్ లో పర్యటిస్తూ ఉంటారు. అందుకనే రాజకీయంగా రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల తో సంబంధం లేకుండా అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడినా భారత్ తో మెరుగైన సంబంధాలు సమకూర్చుకోవడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. 
 
భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై బంగ్లాదేశ్ జూనియర్ విదేశాంగ మంత్రి హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు విదేశాంగ విధాన వర్గాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఎందుకంటే, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ స్నేహాన్ని, ఢాకా న్యూఢిల్లీని సమానంగా చూసే లావాదేవీల సంబంధంగా మార్చే ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలను పరిగణిస్తున్నారు. 
 
ప్రధానమంత్రి తారిక్ రెహమాన్‌ తొలుత భారత్ తో మెరుగైన సంబంధాల కోసం ఆసక్తి చూపుతున్నట్లు సంకేతాలు ఇచ్చినా ఆరునెలలైనా భారత్ పర్యటనకు వెనుకడుగు వేస్తూ ఉండటం, ఆ దేశం చరిత్రలో తొలిసారి పాకిస్థాన్ తో సైనిక సంబంధాలు ఏర్పోర్హ్చుకొనే ప్రయత్నాలు చేస్తుండటం, చైనాతో వ్యూహాత్మక సంబంధాలు ఏర్పోర్హ్చుకోవడంతో పాటు ఈ మధ్య పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా కలిపి ఏర్పాటు చేసుకొన్న `మక్కా కూటమి’లో చేరే విషయంలో సానుకూల సంకేతాలు ఇవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. 
 
షేక్ హసీనా ఉనికిపై ఉన్న అసంతృప్తి, తారిక్ రెహమాన్ న్యూఢిల్లీ పర్యటనకు ఎదురవుతున్న అడ్డంకుల నడుమ, బంగ్లాదేశీయులకు పర్యాటక వీసాలను పునఃప్రారంభించడందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దశాబ్దాలుగా సన్నిహితంగా  ఉన్న భారత్-బంగ్లాదేశ్ సంబంధాల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
అయితే, భారత్ ఆహ్వానానికి స్పందించడానికి బంగ్లాదేశ్ తొందరపడటం లేదని తెలుస్తోంది. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్‌కు సన్నిహితుడైన కబీర్ వ్యాఖ్యలను, ఈ సంబంధాల భవిష్యత్తును పునర్నిర్వచించే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. 
 
“మీ రోజువారీ అల్పాహారం చర్చ భారతదేశం గురించే, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా భారతదేశం గురించే… మీ సొంత దేశం గురించి ఆలోచించండి. ఈ భారతదేశం వ్యామోహం నుండి బయటపడండి. భారతదేశం కూడా మనం మంచి కార్య సంబంధాలు కోరుకునే మరో దేశం మాత్రమే,” అని భారతదేశంతో సంబంధాలపై ప్రశ్నలకు సమాధానమిస్తూ హుమాయున్ కోబిర్ విలేకరులతో పేర్కొన్నారు. 
 
దాదాపు మొత్తం భూ సరిహద్దును పంచుకోవడం పాటు ఈ ఏడాది ఆరంభంలో దేశం తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొన్నప్పుడు న్యూఢిల్లీ సహాయ సహకారాలు అందించడంతో బంగ్లాదేశ్ ప్రధాని భారతదేశాన్ని ఎప్పుడు సందర్శిస్తారని విదేశాంగ విధాన పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికలతో చైనాతో పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన తర్వాత, బంగ్లాదేశ్ కొత్త మిత్రులను సంపాదించుకోవాలని చూస్తోంది.
 
మక్కా ఒప్పందంలో చేరాలని కోరుకుంటున్నట్లు కూడా ఢాకా సూచించింది, ఇది భారత ఉపఖండంలో సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. ద్వైపాక్షిక పర్యటన కోసం ప్రధాని తారిక్ రెహమాన్‌కు భారతదేశం పంపిన ఆహ్వానంపై బంగ్లాదేశ్ ఇంకా స్పందించనప్పటికీ, బిమ్స్టెక్ ఛైర్మన్ హోదాలో ఆహ్వానించబడిన బ్రిక్స్ సదస్సుకు రెహమాన్ ఆహ్వానాన్ని దాటవేశారు.
 
రహ్మాన్ తొలి భారత పర్యటన బహుపాక్షిక సమావేశంలా కాకుండా, ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో జరగాలని ఢాకా కోరుకుంటున్నట్లు బంగ్లాదేశ్ సూచించింది. తారిక్ రహ్మాన్‌ను బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధానిగా కాకుండా, బిమ్స్టెక్ ఛైర్మన్‌గా ఆహ్వానించినట్లు బంగ్లాదేశ్ తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆగస్టులో ద్వైపాక్షిక పర్యటన గురించి భారత్, బంగ్లాదేశ్ చర్చలు జరుపుతున్న తరుణంలోనే, న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగించడంపై బంగ్లాదేశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో ఆ ప్రణాళికలు విఫలమయ్యాయి. 
 
ఆ కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని, అక్కడ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వం సమర్థించదని భారత్ స్పష్టం చేసింది. భారత్-బంగ్లాదేశ్ సంబంధాల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ జాతీయ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ ఇలా చెప్పారు: “భారత్ పట్ల బంగ్లాదేశ్‌కు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడం, అక్కడి నుండే రాజకీయ కార్యకలాపాలు సాగించే అవకాశాన్ని ఆమెకు ఇవ్వడం వంటి విషయాలపై మాకు అసంతృప్తి ఉంది; ఒక స్నేహపూర్వక పొరుగు దేశం ఇలా వ్యవహరించకూడదని మేము భావిస్తున్నాము.” 
 
“మేము భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నాము.  కానీ వారు కూడా మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు ఇప్పటివరకు మాకు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు,” అని ఆయన జోడించారు. “గతంలో అవామీ లీగ్ హయాంలో, నాటి విదేశాంగ మంత్రి భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను భార్యాభర్తల మధ్య ఉండే బంధంతో పోల్చారు. మాకు అలాంటి భార్యాభర్తల బంధం వద్దు. రెండు సార్వభౌమ దేశాల మధ్య ఉండాల్సిన విధంగా, పరస్పర గౌరవంపై ఆధారపడిన సంబంధాన్ని మేము కోరుకుంటున్నాము,” అని ఆయన పేర్కొన్నారు. 
 
ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ వైఖరి, ఢాకాలో ఉన్న అంతర్గత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా, బంగ్లాదేశ్ భారత్‌తో లోతైన లేదా బహుపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి వెనుకాడుతోంది. సంబంధాలు కేవలం షేక్ హసీనా అంశానికే పరిమితం కాకుండా, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా సాగాలని భారత్ భావిస్తోంది. భారీ రాజకీయ అంశాల కంటే, రెండు దేశాల సామాన్య ప్రజలపై ప్రభావం చూపే అంశాల ఆధారంగా సంబంధాలు ఉండాలని బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది సూచించారు. 
 
గత నెలలో బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రితో సమావేశమైన తర్వాత త్రివేది ఇలా తెలిపారు: “మనం ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించుకుందాం. వ్యాపారాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకుందాం. రాజకీయాలు వాటి దారిన అవి సాగుతూనే ఉంటాయి. కానీ వ్యాపారం మరియు సామాన్య ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలను కల్పించడం మన బాధ్యత.” సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి భారత్ తలుపులు తెరిచే ఉంచింది. ప్రస్తుత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో త్రివేది సమావేశమవుతున్నారు.