యూపీలో అల్‌కైదా సానుభూతిప‌రుడు అరెస్ట్

యూపీలో అల్‌కైదా సానుభూతిప‌రుడు అరెస్ట్
 
ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అల్‌కైదా ఉగ్ర‌సంస్థ‌ సానుభూతిప‌రుడిని ఆ రాష్ట్ర యాంటీ టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఇండియాలో ఉగ్ర నెట్‌వ‌ర్క్ న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ అంశానికి సంబంధించిన వివ‌రాలివి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అజాంగ‌ఢ్‌లోని దిదార్‌గంజ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మొహ‌మ్మ‌ద్ న‌బీల్ అనే 19 ఏళ్ల యువ‌కుడిని అజాంగ‌ఢ్‌లో ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అత‌డు ఉగ్ర‌సంస్థ‌ అల్ ఖైదా ఇండియా నెట్‌వ‌ర్క్ కోసం ప‌ని చేస్తున్నాడు. జ‌మ్మూ కాశ్మీర్‌లో అనేక మంది యువ‌త‌ను త‌న నెట్‌వ‌ర్క్ కోసం ప‌నిచేసేలా ప్రేరేపిస్తున్నాడు. ఎన్‌క్రిప్టెడ్ సోష‌ల్ మీడియా గ్రూప్స్ ద్వారా యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు న‌డిచేలా ప్రోత్స‌హిస్తున్నాడు. త‌న సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితులైన వారిని జిహాద్ వైపు న‌డిపించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం నిధులు సేక‌రించి, దేశంలో హింస‌కు పాల్ప‌డాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. 

అలాగే, పాకిస్తాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఘాజ్వా ఇ హింద్ సంస్థ కోసం కూడా ప‌ని చేస్తున్నాడు. న‌బీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా మ‌రిన్ని కీల‌క విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. అత‌డు పాకిస్తాన్, ట‌ర్కీ, బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్ర శిక్ష‌ణ తీసుకోవాల‌ని కూడా ప్ర‌ణాళిక‌లు రూపొందించాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో బాంబుల త‌యారీపై శిక్ష‌ణ తీసుకోవాల‌నుకున్నాడు. 

అత‌డు నిర్వ‌హిస్తున్న సోష‌ల్ మీడియా గ్రూపుల‌లో బాంబు త‌యారీకి సంబంధించిన కొన్ని వీడియోల‌ను కూడా షేర్ చేశాడు. జ‌మ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది యువ‌త‌ను ఉగ్ర‌వాదం వైపు ఆక‌ర్షించేలా చేసి, వారి ద్వారా దేశంలో హింస‌కు పాల్ప‌డాల‌ని న‌బీల్ ప్ర‌య‌త్నించాడు. ఇందుకోసం పాకిస్తాన్ సాయం తీసుకోవాల‌ని కూడా భావించాడు. న‌బీల్ ఫ్లేమ్స్ ఆఫ్ వార్ అనే వాట్సాప్ గ్రూపులో స‌భ్యుడిగ‌గా ఉన్నాడు. ఈ గ్రూపులో బంగ్లాదేశ్, మ‌య‌న్మార్, సౌదీ అరేబియా వంటి దేశాల‌కు చెందిన స‌భ్యులున్నారు.