కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం పట్ల మోదీ హెచ్చరిక 

కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం పట్ల మోదీ హెచ్చరిక 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిక్స్ దేశాల మధ్య స్థితిస్థాపకతను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ , కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం ఉమ్మడి వృద్ధికి ఆటంకాలు సృష్టించగలదని బ్రిక్స్ ముగింపు సమావేశంలో హెచ్చరించారు. “సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన ఉమ్మడి పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో మేము సమ్మిళితత్వానికి ప్రాధాన్యత ఇచ్చాము,” అని ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత’పై జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, ఈ సవాళ్లను ఎదుర్కొని మానవాళి కోసం వర్ధిల్లడానికి బ్రిక్స్ తప్పనిసరిగా సహకారం, సమ్మిళిత వృద్ధి ద్వారా ఎదగాలని మోదీ స్పష్టం చేశారు. గ్లోబల్ సౌత్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రిక్స్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నాయని, ఎందుకంటే వారి గొంతులకు విలువ ఇవ్వబడుతుందని, వారి అనుభవాలకు విలువ ఇవ్వబడుతుందని, పరిష్కారాలు వారిపై రుద్దబడకుండా వారితో భాగస్వామ్యంతో రూపొందించబడతాయని మోదీ జోడించారు. 

ప్రపంచ జనాభాలో సుమారు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కూటమి అయిన బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సమావేశం, లాజిస్టిక్స్ సరఫరా గొలుసులు, స్టార్టప్‌లు, అంటువ్యాధుల నియంత్రణ వంటి రంగాలలో కీలక ఫలితాలతో ముగిసింది.

 “మన మూలాలు వేర్వేరు వాస్తవాలలో ఉండవచ్చు, కానీ కలిసికట్టుగా, సహకారంతో మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాం. మానవాళి కోసం వికసిస్తాం. మన వైవిధ్యమే మన గుర్తింపుగా, మన సహకారమే మన స్ఫూర్తిగా, మన పురోగతి సకల మానవాళికి సేవ చేయాలి” అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌లతో సహా ఈ కూటమిలోని అగ్ర నాయకుల సమక్షంలో మోదీ తెలిపారు.

2027లో ఈ కూటమి తదుపరి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న చైనాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిక్స్ తన మూడవ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ప్రపంచం ఇప్పుడు దాని నుండి ‘నిర్దిష్ట ఫలితాలను’ ఆశిస్తోందని ఆయన చెప్పారు.

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు రెండవ రోజు బహిరంగ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “బ్రిక్స్ తన మూడవ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం ఇప్పుడు మన నుండి కేవలం ఆలోచనలు, వాగ్దానాలు మాత్రమే కాకుండా, స్పష్టమైన ఫలితాలను ఆశిస్తోంది. మనందరి సమిష్టి కృషితో ఈ అంచనాలను మనం తప్పకుండా అందుకుంటామని నాకు పూర్తి నమ్మకం ఉంది” అని తెలిపారు.

బ్రిక్స్‌కు తదుపరి ఆతిథ్యమిస్తున్న చైనాకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, న్యూఢిల్లీ సదస్సును విజయవంతం చేసినందుకు నాయకులను, వారి బృందాలను ఆయన అభినందించారు.

నిబంధనలు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్స్​ లేని కూడలి

నిబంధనలు లేని ప్రపంచం ట్రాఫిక్ లైట్స్​ లేని కూడలి లాంటిదని, అక్కడ గందరగోళం, అశాంతి మాత్రమే మిగులుతాయని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ హెచ్చరించారు. న్యాయం, సమానత్వం అనేవి ప్రపంచ దేశాల ఆకాంక్షలని చెబుతూ అందుకే అంతర్జాతీయ నియమ, నిబంధనలను ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసికట్టుగా రాయాలే తప్ప, కొన్ని దేశాలే నిర్ణయించకూడదని స్పష్టం చేశారు. బలవంతుడిదే రాజ్యం అనే పాతకాలపు ఆలోచన విధానానికి కాలం చెల్లింపోయిందని, దానిని ఎప్పుడో వదిలిపెట్టేసి ఉండాల్సిందని చెప్పారు. 

 అందుకే అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధమైన పాలనను కాపాడడానికి గ్లోబల్ సౌత్ దేశాలన్నీ ఉమ్మడిగా పోరాడాలని పిలుపిచ్చారు.  సార్వభౌమ సమానత్వం, ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం లాంటి అంతర్జాతీయ ప్రాథమిక నిబంధనలను కాపాడాలని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలు ప్రపంచంలోని అందరికీ సమానంగా వర్తించేలా చూడాలని జిన్​పింగ్ పేర్కొన్నారు.