న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో వచ్చే ఏడాది శిఖరాగ్ర సమావేశానికి బీజింగ్ ఆతిథ్యమిస్తుందని ప్రకటించడంతో, బ్రిక్స్ కూటమి చైనాకు తిరిగి రానుంది. ఈ కూటమికి చైనా ఆతిథ్యం ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గత రెండు దశాబ్దాలలో, చైనా మూడు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది, వాటిలో ప్రతి ఒక్కటీ ఈ కూటమి పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
చైనా మీడియా నివేదికల ప్రకారం, చైనా నిజమైన బహుపాక్షికవాదం ద్వారా ఐక్యతకు పునాదిని బలోపేతం చేయడం, సహకార వేదికల ద్వారా అభివృద్ధి వ్యూహాల సమన్వయాన్ని ప్రోత్సహించడం, గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, గ్లోబల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్‌ల ద్వారా ఉమ్మడి అభివృద్ధికి ఊపునివ్వడం కొనసాగిస్తుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, హరిత అభివృద్ధి, కృత్రిమ మేధస్సు, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అభివృద్ధి వంటి రంగాలలో మరిన్ని మైలురాయి ఫలితాలను సాధించడానికి కూడా ఇది కృషి చేస్తుంది.
అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లను పరోక్షంగా ఉద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడుతూ, ఫిబ్రవరి చివరలో మధ్యప్రాచ్యంలో మొదలైన ఘర్షణ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అది ప్రపంచ ప్రయోజనాలకు కూడా ఏమాత్రం ఉపయోగపడదని స్పష్టం చేశారు. “మధ్యప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మారుతున్న కొద్దీ, అక్కడ జరుగుతున్న యుద్ధం ఆయా ప్రాంతాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది,” అని షీ తెలిపారు.
“ఇది అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా లేదు.” అని చెబుతూ సార్వభౌమాధికార ఉల్లంఘనలను వ్యతిరేకించాలని, ప్రపంచవ్యాప్తంగా శాంతిని కాపాడేందుకు కృషి చేయాలని షీ బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కాగా, పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో శాంతి స్థాపన పాత్రను చేపట్టాలని బ్రిక్స్ దేశాలకు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ “అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు దోహదపడదు” కాబట్టి, ఆ లక్ష్యం దిశగా బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్యులతో కలిసి చైనా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న జిన్‌పింగ్, ఏ దేశం కూడా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని అంగీకరించకూడదని, అలాగే “ప్రధాన సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని” కోరారు. అలాగే, అన్ని రకాల “సంరక్షణవాద” విధానాలను వ్యతిరేకించాలని కూడా షీ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. “ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా ఉన్న బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు మనం మద్దతు ఇవ్వాలి. అన్ని రకాల సంరక్షణవాద విధానాలను తిరస్కరించాలి,” అని ఆయన చెప్పారు.

More Stories
బ్రిక్స్‌లో పాకిస్థాన్ చేరేందుకు అడ్డంకిగా భారత్ వీటో!
104 మంది సిక్కు యాత్రికుల భారత్ యాత్రను అడ్డుకున్న పాక్
భారత్ తో విభేదాలను పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధం