తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం

తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, అమరుల బలిదానాలతో ముడిపడి ఉన్న సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అధికారికంగా నిర్వహించాలని 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా జరిపేదాకా బిజెపి అలుపెరగని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అత్యంత వైభవంగా, అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
 
బీజేపీ ‘తెలంగాణ విమోచన కమిటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ విమోచనం – జాతీయవాదుల పాత్ర” సంస్మరణ సదస్సులో ముఖ్య వక్తగా
పాల్గొంటూ సెప్టెంబర్ 17వ తేదీన ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ బూత్ పరిధిలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించాలని, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే చారిత్రక తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని  పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపిచ్చారు.

మాజీ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు గారు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కె. లక్ష్మణ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ డా. బూర నర్సయ్య గౌడ్, విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు బంగారు శృతి, ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 
ఆనాడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన ‘ఆపరేషన్ పోలో’ సమయంలో భారత సైనికుల అపూర్వ బలప్రదర్శన, వ్యూహాత్మక చాకచక్యం ముందు నిజాం నిరంకుశ పాలన తలొగ్గి లొంగిపోక తప్పలేదని రామచందర్ రావు గుర్తుచేశారు. నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబరు 17వ తేదీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు.