104 మంది సిక్కు యాత్రికుల భారత్ యాత్రను అడ్డుకున్న పాక్ 

104 మంది సిక్కు యాత్రికుల భారత్ యాత్రను అడ్డుకున్న పాక్ 
ఫైసలాబాద్ నుండి షార్జా మీదుగా భారత్‌కు వెళ్లాల్సిన కనీసం 104 మంది పాకిస్థానీ సిక్కు యాత్రికులకు గురువారం అర్ధరాత్రి విమానం ఎక్కేందుకు వారి వద్ద ‘నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (ఎన్ఓసి) లేదంటూ అనుమతి నిరాకరించారు. వీరు ఉత్తరాఖండ్‌లోని గురుద్వారా హేమ్‌కుంట్ సాహిబ్‌ను సందర్శించాల్సి ఉంది.  తెల్లవారుజామున 2:10 గంటలకు బయలుదేరాల్సిన విమానాన్ని ఎక్కేందుకు యాత్రికులు ఫైసలాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా వారిని  అడ్డుకున్నారు.
వారిలో ఎక్కువ మంది నంకనా సాహిబ్‌కు చెందినవారు కావడంతో, శుక్రవారం రాత్రి గురుద్వారా జన్మ స్థాన్ (నంకనా సాహిబ్) వద్ద ఈ సమస్యపై చర్చించడానికి సమావేశమయ్యారు.  సాయంత్రం వేళ, యాత్రికుల బృంద నాయకుడు పాపిందర్ సింగ్ పాకిస్థాన్ నుండి ఫోన్ ద్వారా మాట్లాడుతూ, ‘ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’ డిప్యూటీ సెక్రటరీ ఫరాజ్ అబ్బాస్, నాలుగు రోజుల్లోపు వారి యాత్రకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్న ఎస్జీపిసి అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి, యాత్రికుల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.  భారత ప్రభుత్వం యాత్రికులకు వీసాలు జారీ చేసిన తర్వాత, సిక్కు యాత్రికుల బృందం (జథా) ప్రయాణానికి పాకిస్థాన్ అధికారులు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని ఆయన స్పష్టం చేశారు. అట్టారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా ఈ బృందం ప్రయాణానికి పాకిస్థాన్ ప్రభుత్వం సహకరించి ఉంటే అది స్వాగతించదగిన చర్యగా ఉండేదని ఆయన పేర్కొన్నారు.
 
ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ యాత్రా విభాగం చైర్మన్ పరమ్‌జిత్ సింగ్ చండోక్‌కు ఫోన్ ద్వారా తమ ఇబ్బందులను వివరిస్తూ, పాకిస్థానీ బృంద నాయకుడు పాపిందర్ సింగ్ తమ వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌లు, భారతీయ వీసాలు ఉన్నప్పటికీ, ఎన్ఓసి సమర్పించాలని అధికారులు కోరారని తెలిపారు. ప్రభుత్వ, పాక్షిక-ప్రభుత్వ లేదా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలలో పనిచేసే పాకిస్థానీ పాస్‌పోర్ట్ హోల్డర్లకు మాత్రమే ఎన్ఓసి అవసరమని చండోక్ చెప్పారు. 
 
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిపివేయటం, ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత రెండు దేశాలు ఒకదాని గగనతలాన్ని మరొకటి ఉపయోగించకుండా నిషేధించడం వల్ల, ఈ యాత్రికులు గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారు.  విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా ఆ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చందోక్ తెలిపారు.
పాకిస్థాన్ సిక్కు నాయకత్వంలోని వర్గ విభేదాలతో ఈ ఘటనకు సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వర్గాలు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్’ (పిటిఐ),  ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్’ (పిఎంఎల్-ఎన్) రాజకీయ వర్గాలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.