తెలంగాణలో సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం తెచ్చిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు పాల్వయి హరీశ్ బాబు, రామారావు పవార్ పాటిల్, పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.
ఇటు అధికార పక్షంగా కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ రైతు సమస్యలను పట్టించుకోలేకపోతున్న సమయంలో ఈ తరహా నిరసనకు ప్రత్యేకత దక్కింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రైతుల పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్ విధానంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ ఈ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు.
ఈ ర్యాలీకి బీజేపీ శాసనసభా పక్ష నేతలు, ఎమ్మెల్యేలు , ముఖ్య నాయకులు నేతృత్వం వహించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ, రైతుల సమస్యలను సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ బయట ట్రాక్టర్లపై ఎక్కి నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతీ రైతుకు ఫసల్ బీమా యోజన ద్వారా వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ర్యాలీగా వస్తున్న బీజేపీ ఎమ్మెల్యేల ట్రాక్టర్లను అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పొరుగు రాష్ట్రాల్రు ఫసల్ బీమా యోజనను సమర్థవంతంగా అమలు చేస్తూ రైతులను ఆడుకుంటుంటే, తెలంగాణలో మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర పథకాన్ని పక్కనబెడుతున్నారని మండిపడ్డారు.
ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఏటా వేలాది మంది రైతులు పంటలు నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే రైతులకు రూ. 500 బోనస్, పంటల భరోసా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు.
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఫసల్ బీమా యోజనలో రాష్ట్ర వాటాను చెల్లించి తక్షణమే ప్రీమియం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంట నష్టపరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని, లేకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అటు అసెంబ్లీ లోపల, ఇటు వెలుపల కూడా రైతుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన అమలే కాకుండా, రైతు రుణమాఫీ అరకొరగా అమలు చేయడంపై, రైతుబంధు జమ కాలేదనే అంశాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఈ ట్రాక్టర్ల ర్యాలీతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు నిరసనకారులను సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి రైతాంగ డిమాండ్ల ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గేటు వద్దే వారిని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల వేలాది మంది రైతులు నష్టపరిహారానికి దూరమవుతున్నారని మండిపడ్డారు. పంట నష్టపరిహారం, మద్దతు ధర, పూర్తిస్థాయి రుణమాఫీ అందించే వరకు అసెంబ్లీ లోపలా, వెలుపలా నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
More Stories
కేరళ నుండి ప్రపంచ వ్యాప్తమైన `లవ్ జిహాద్’
బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య అవరోధాలు తొలగించాలి.. మోదీ పిలుపు
బొల్లారం రెజిమెంట్ లో చోరీ ఆయుధాలు స్వాధీనం