ఆరేళ్ల విరామం తర్వాత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సమావేశంలో, ఇటీవల కాలంలో సినిమాలను సమీక్షించే ‘రివైజింగ్ కమిటీ’లకు క్రమం తప్పకుండా నాయకత్వం వహించిన వారి జాబితాను సభ్యులు కోరినట్లు తెలిసింది. ఈ వర్చువల్ సమావేశంలో వివాదాస్పదమైన ఇటీవలి సినిమాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు, చలనచిత్ర పరిశ్రమతో సంబంధాలను బలోపేతం చేసే కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీబీఎఫ్సీ విధానం ప్రకారం, ‘ఎగ్జామినింగ్ కమిటీ’ (ప్రాథమిక పరిశీలన కమిటీ) నిర్ణయం పట్ల నిర్మాతలు లేదా బోర్డు అసంతృప్తిగా ఉన్నప్పుడు, సినిమాను పునఃపరిశీలించే ప్యానెల్‌నే ‘రివైజింగ్ కమిటీ’ అంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జరిపిన పరిశీలనలో, ముగ్గురు బోర్డు సభ్యులే అత్యధిక రివైజింగ్ కమిటీలకు నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడైంది.
సెన్సార్ బోర్డుగా పిలువబడే సిబిఎఫ్సీ 149వ సమావేశం ఆగస్టు 29న జరిగింది. వాస్తవానికి ఈ సంస్థ గత ఆరేళ్లుగా బోర్డు సమావేశాన్ని నిర్వహించలేదు. శశి శేఖర్ వెంపటి సిబిఎఫ్సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి సమావేశం ఇదే. ‘సినెమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్ 2024’ ప్రకారం, బోర్డు ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమావేశం కావాలి.
12 మంది సభ్యులున్న ఈ బోర్డు చివరిసారిగా 2019 ఆగస్టు 31న సమావేశమైంది. సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉన్నప్పటికీ, 2017 తర్వాత వారిలో ఎవరినీ అధికారికంగా తిరిగి నియమించలేదు. ఈ బోర్డు చివరిసారిగా 2017 ఆగస్టు 1న పునర్వ్యవస్థీకరించారు. నిబంధనల ప్రకారం బోర్డు కనీసం త్రైమాసికానికి ఒకసారైనా సమావేశం కావాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
‘సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్ 1983’ స్థానంలో అమల్లోకి వచ్చిన ‘సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్ 2024’ గురించి కూడా చర్చ జరిగింది. అలాగే, 16 ఏళ్లు, 18 ఏళ్ల వయస్సు ఆధారిత సర్టిఫికేషన్ల మధ్య ఉన్న వ్యత్యాసంపై మరింత స్పష్టత ఇవ్వాలనే అభ్యర్థన కూడా చర్చకు వచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 2024 నిబంధనలు వయస్సు ఆధారిత సర్టిఫికేషన్ వర్గాలను ప్రవేశపెట్టాయి.
ఇందులో భాగంగా, ప్రస్తుతం ఉన్న ‘యుఎ’ వర్గాన్ని మూడు వయస్సు-ఆధారిత ఉప-వర్గాలుగా విభజించారు: అవి 7 ఏళ్లు ( యుఎ 7+), 13 ఏళ్లు (యుఎ 13+), 16 ఏళ్లు ( యుఎ 16+). సినమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్, 2024లో పొందుపరిచిన మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
గత ఆరేళ్లుగా సర్టిఫికేషన్ సంస్థ (సిబిఎఫ్సీ), బోర్డు సభ్యుల మధ్య ఎటువంటి సంప్రదింపులు జరగకపోవడంతో, తాజా పరిణామాలపై అవగాహన పెంచుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఒక అధికారి తెలిపారు. కొన్ని సినిమాల సర్టిఫికేషన్ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర అసంతృప్తి నెలకొందని కూడా ఆ అధికారి పేర్కొన్నారు.

More Stories
లోధి ఎస్టేట్ భవనం నుంచి ఫోర్డ్ ఫౌండేషన్ తొలగింపు
అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు