ముడి చమురు ధర 100 డాలర్లు దాటటంతో భారత్ ఆందోళన 

ముడి చమురు ధర 100 డాలర్లు దాటటంతో భారత్ ఆందోళన 
బ్రెంట్‌ క్రూడ్‌ ధర మరోసారి బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటడంతో ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్‌ తన ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది.  ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్‌ దేశాల నుంచి ముడి చమురు, సహజవాయువు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. 
 
ముడి చమురు, గ్యాస్‌ రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలు ప్రమాదకరంగా మారితే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.  నౌకలపై దాడులు లేదా సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు చేరే అవకాశాన్ని మార్కెట్‌ వర్గాలు కొట్టిపారేయడం లేదు. 
ఇలాంటి పరిస్థితుల్లో అధిక ధరలకు చమురు కొనుగోలు చేయాల్సి వస్తే దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరగడంతో పాటు దిగుమతి బిల్లు కూడా భారీగా పెరగవచ్చు. రేటింగ్‌ సంస్థ ఐసిఆర్ఏ అంచనాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్‌పై లీటరుకు సగటున రూ.5, డీజిల్‌పై లీటరుకు దాదాపు రూ.23 వరకు ఆయిల్‌ కంపెనీలకు నష్టం వస్తున్నట్లు సమాచారం. 
 
ఇక గృహ వినియోగ ఎల్‌పీజీ విక్రయాల్లోనూ ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ.200 వరకు నష్టం ఉంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల కేవలం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనే కాకుండా రవాణా వ్యయాలపైనా ప్రభావం పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువులు, పారిశ్రామిక ఉత్పత్తులు, విమాన ప్రయాణాలు, పెయింట్లు, టైర్లు, కెమికల్స్‌ వంటి అనేక రంగాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. 

దీంతో దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో రూపాయి విలువపై ఒత్తిడి, స్టాక్‌ మార్కెట్లలో అస్థిరత, దిగుమతి బిల్లు పెరుగుదల వంటి పరిణామాలు కూడా భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారవచ్చు. చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

 అయితే ఇది పూర్తిగా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ చమురు ధరలు, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చమురు ధరల పెరుగుదల ఇప్పటికే భారత్‌ దిగుమతి వ్యయాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్య భారత ముడి చమురు దిగుమతుల విలువ 63.4 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 40.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే ఏడాది వ్యవధిలో చమురు దిగుమతుల విలువ గణనీయంగా పెరిగింది.