అక్రమ నగదు చలామణి (మనీ లాండరింగ్) ఆరోపణలకు సంబంధించిన కేసులో, కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి, చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అయిన కుమార్తె ప్రియాంక జార్కిహోళి, అలాగే ఇతర సంబంధిత వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు ప్రారంభించింది.
బెంగళూరులోని డాలర్ కాలనీలో ఉన్న జార్కిహోళి నివాసం, ఆయన కుమార్తెకు సంబంధించిన ప్రాంగణాలు, ఎక్సైజ్ శాఖ అధికారి అయిన ఆయన బావమరిది వై.డి. మంజునాథ్‌కు సంబంధించిన ప్రదేశాలతో సహా కర్ణాటకలోని 18 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెళగావి అదనపు ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న మంజునాథ్ ఇప్పటికే మరొక ఎక్సైజ్ కేసుకు సంబంధించి ఈడీ పరిశీలనలో ఉన్నారు.
ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న సోదాలు ‘ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్’ (ఫెమా) కింద చేపట్టినవి, ఇవి మంజునాథ్‌పై ఉన్న ఎక్సైజ్ కేసుతో సంబంధం లేనివి. “ఇది జార్కిహోళికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రత్యేక కేసు, అయితే ఈ విచారణలో మంజునాథ్ కూడా ఒక భాగంగా ఉన్నారు” అని ఒక వర్గం పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ దాడులపై జార్కిహోళి ఇంకా స్పందించలేదు.
అక్రమంగా లంచాలు వసూలు చేసే సిండికేట్‌కు సంబంధించిన వ్యవహారంలో, జూన్ నెలలో మంజునాథ్ నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. మంజునాథ్ బళ్లారి మాజీ ఎంపీ వై. దేవేంద్రప్ప కుమారుడు, సతీష్ జార్కిహోళికి బావమరిది అవుతారు.
చిక్కోడి లోక్‌సభ ఎంపీ ప్రియాంకాకు చెందిన బెల్తావి జిల్లాలోని ఇంటిని కూడా ఈడీ తనిఖీ చేస్తున్నది. మంత్రి, ఆయన కుమార్తె ఎంపీపై కొత్త కేసులో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. బెంగుళూరు, బెల్గావి, గోకర్ణతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. జార్కిహోలీ ఫ్యామిలీ బిజినెస్‌తో పాటు కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇండ్లల్లో తనిఖీలు చేపట్టారు.
నివేదికల ప్రకారం, ఈ ఏజెన్సీ ఇంతకుముందు సుమారు రూ. 3 కోట్ల అక్రమ విదేశీ నిధులను గుర్తించింది. ఇప్పుడు, లైసెన్సుల జారీలో జరిగిన అవకతవకల ద్వారా వచ్చిన డబ్బును మనీలాండరింగ్ చేశారా లేదా భారతదేశం వెలుపలకు తరలించారా అనే విషయాన్ని పరిశీలిస్తోంది. దర్యాప్తు అధికారులు, సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఆర్థిక లావాదేవీల మూలాలను నిర్ధారించడంతో పాటు, విచారణలో ఉన్నవారి పాత్రలను కూడా నిర్ణయించనున్నారు.

More Stories
పొదుపు కంటే వేగంగా పెరుగుతున్న మధ్య తరగతి కుటుంబాల అప్పులు
మాజీ సీఎం విజయన్, కుమార్తె, అల్లుడిపై అవినీతి కేసు
రూ.1.10 లక్షల కోట్లతో ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు