ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్జేడీ చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్, మరో ఆరుగురిపై మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేయాలని గురువారం ఆదేశించింది.
16 మంది నిందితులలో ఏడుగురిని నిర్దోషులుగా ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ప్రకటించారు. లాలూ సహా తొమ్మిది మంది నిందితులపై అభియోగాలు నమోదు చేయాలన్న ఆదేశాన్ని మౌఖికంగా వెల్లడించారు. కాగా, నేర ఉద్దేశం లేదా నేరం చేయడానికి కావలసిన మానసిక స్థితిని నిర్ధారించే కఠినమైన ప్రమాణాలు ప్రస్తుత దశలో అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు.
నిందితులపై బలమైన అనుమానం ఉందో లేదో మాత్రమే కోర్టు చూడాల్సి ఉంటుందని చెప్పారు. రాజకీయ కక్షతో ఆరోపణలు ప్రేరేపించినట్లుగా ఈ ఫిర్యాదు సూచించడం లేదని జడ్జి గోగ్నే వెల్లడించారు. అధికారికంగా అభియోగాల నమోదు ఖరారు కోసం తదుపరి విచారణ అక్టోబర్ 3న వాయిదా వేశారు.
మరోవైపు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచీ, పులిలోని ‘రేడియో హోటల్స్’ లీజును సుజాత హోటల్స్‌కు కట్టబెట్టేందుకు రైల్వే అధికారులు టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతిఫలంగా సుజాత హోటల్స్ డైరెక్టర్లయిన వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్, పాట్నాలోని తమ విలువైన భూమిని తక్కువ ధరకు డీఎంసీపీఎల్ అనే కంపెనీకి బదిలీ చేశారు.
లాలూ ప్రసాద్‌కు సన్నిహితులైన ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా ఆధ్వర్యంలో ఈ కంపెనీ ఉన్నది. ఆ తర్వాత సరళా గుప్తా, ఇతరులు ఈ కంపెనీకి చెందిన షేర్లను అత్యల్ప ధరకు లాలూ భార్య రాబ్రీ దేవి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు బదిలీ చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఆర్జేడీ అధినేత లాలూ, మరో 11 మందిపై కోర్టు ఇప్పటికే అవినీతి అభియోగాలు కూడా నమోదు చేసింది.

More Stories
ముడి చమురు ధర 100 డాలర్లు దాటటంతో భారత్ ఆందోళన
రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు
కర్నాటక మంత్రి సతీశ్, ఎంపీ ప్రియాంకా ఇంట్లో ఈడీ సోదాలు