ఇరాన్ చేతికి అమెరికా అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి ‘డైవ్ ఎల్డీ’?

ఇరాన్ చేతికి అమెరికా అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి ‘డైవ్ ఎల్డీ’?

హర్మూజ్ జలసంధిలో అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జల సంధి ప్రవేశ మార్గం వద్ద అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక‌ మాన‌వ‌ర‌హిత జ‌లాంత‌ర్గామి ఇరాన్‌కు చిక్కింది. ఈ మేరకు ఇరానీ ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన అధికారిక వార్తా సంస్థ సెఫా న్యూస్ ప్రకటన చేసింది. అమెరికా సేనలు ఐదు చమురు ట్యాంకులను ధ్వంసం చేసిన అనంతరం  అత్యంత సంక్లిష్ట‌మైన నిఘా స‌మాచారం ఆధారంగా స‌బ్‌మెరైన్‌ను చేజిక్కించుకున్న‌ట్లు  ఐఆర్‌జీసీ  పేర్కొంది. 

ఇరాన్ దళాలు జలాంతర్గామికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశాయి. “ఈరోజు తెల్లవారుజామున హోర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద, అమెరికా ఉగ్రవాద సైన్యానికి చెందిన అత్యంత ఆధునిక, మానవరహిత, స్మార్ట్ జలాంతర్గాములలో ఒకదానిని ఐఆర్‌జిసి నావికా దళాలు ఒక సంక్లిష్టమైన నిఘా మరియు కార్యాచరణ చర్యలో పట్టుకున్నాయి,” అని గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

దీనిని ప్రపంచంలోనే అత్యాధునిక స‌బ్‌స‌ర్ఫేస్ వెహిక‌ల్ టెక్నాల‌జీ కలిగిన ‘డైవ్- ఎల్డీ’గా ఇరాన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. హర్మూజ్ జలసంధిపై ఎగురుతున్న అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూడా తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసాయని  ఐఆర్‌జీసీ  తెలిపింది. ఇరాన్ ప్రకటన అనంతరం ఓ ప్రకటన విడుదల చేసిన అమెరికా సైన్యం ప్రాంతీయ జలాల్లో సర్వే నిర్వహిస్తుండగా తమకు చెందిన ఒక అండర్‌వాటర్ డ్రోన్ సాంకేతిక లోపానికి గురైందని చెప్పింది. 

అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్న పరికరం ఇదేనా? కాదా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. “పశ్చిమాసియా జలాల్లో కొనసాగుతున్న కార్యకలాపాలకు మద్దతుగా ఇది సర్వే చేస్తుంది. సాంకేతిక లోపం తలెత్తిన ఆ డ్రోన్ పాత మోడల్. అందులో ఎలాంటి సున్నితమైన సమాచారం కానీ, అత్యంత రహస్యమైన సోనార్ లేదా రాడార్ పరికరాలు కానీ లేవు’’ అని పెంటగాన్ ప్రతినిధి తెలిపారు.

తక్కువ ఖర్చుతో సముద్ర ప్రాంతాలను పర్యవేక్షించడం, సమాచారాన్ని సేకరించడం, నావికుల ప్రాణాలకు ముప్పు లేకుండా శత్రు నౌకలు, జలాంతర్గాములను ట్రాక్ చేయడం కోసం అమెరికా సైన్యం అన్‌మ్యాన్డ్ నావికా వ్యవస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆండూరిల్  సంస్థ వెబ్‌సైట్ ప్రకారం.. డైవ్-ఎల్డీ డ్రోన్ బేస్ క్యాంప్‌నకు తిరిగి రాకుండానే 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేయగలదు. 

 
ఇది సముద్ర జలాల్లో 6,000 మీటర్ల (19,700 అడుగులు) లోతులో ఉంటుంది. ఒక్కో యూనిట్ ధర దాదాపు 2.5 మిలియన్ డాలర్లు (రూ. 20 కోట్లకు పైగా) ఉంటుందని సైనిక వార్తా సంస్థ డిఫెన్స్ స్కూప్ పేర్కొంది.