రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్  రైల్వే ప్రాజెక్టులు 

రూ.20,804 కోట్లతో 8 మల్టీట్రాకింగ్  రైల్వే ప్రాజెక్టులు 

* దక్షిణాది రాష్ట్రాలకు ఐదు కీలక ప్రాజెక్టులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జ‌రిగిన‌ కేంద్ర కేబినెట్ భేటీలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి ఎనిమిది కీలక మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.20,804 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది.  

ఈ కారిడార్లు దేశంలోని అనేక ప్రధాన నగరాలను కలుపుతాయి. ఢిల్లీ-హౌరా మార్గంలో కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, పాట్నా, అసన్సోల్ వంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గం మథుర, కోటా, రత్లాం, వడోదర, సూరత్ వంటి నగరాలను కలుపుతుంది. ఢిల్లీ-చెన్నై మార్గం ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, విజయవాడ వంటి నగరాలను కలుపుతుంది. ముంబై-చెన్నై మార్గంలో పూణేతో సహా అనేక ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలకు రూ.10,021 కోట్లతో ఐదు ప్రాజెక్టులు, అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రూ.10,783 కోట్లతో మూడు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా బహుళ రవాణా మార్గాల అనుసంధానాన్ని, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి, పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఈ ప్రాజెక్టులను ప్రణాళిక చేస్తున్నారు.

తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం కలిగిన సికింద్రాబాద్ (ఘట్‌కేసర్)–కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్–వరంగల్ ప్రధాన రైల్వే మార్గంలో రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రయాణికుల రవాణాతో పాటు బొగ్గు, సిమెంట్, ఉక్కు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల వంటి సరుకు రవాణా కూడా మరింత వేగవంతం కానుంది. యాదాద్రి, భువనగిరి, కాజీపేట ప్రాంతాల అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది.

కాగా, తెలంగాణ‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో రూ.10,021 కోట్ల వ్యయంతో చేపట్టే ఐదు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో అరక్కోణం–రేణిగుంట 3వ, 4వ లైన్ (77 కి.మీ.), వైట్‌ఫీల్డ్–బంగారపేట 3వ, 4వ లైన్ (47 కి.మీ.), హోసూరు–ఓమలూరు డబ్లింగ్ (147 కి.మీ.), సేలం–కరూర్–దిండిగల్ డబ్లింగ్ (159 కి.మీ.) ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా నాలుగు రాష్ట్రాల్లోని 17 జిల్లాల్లో సుమారు 540 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ విస్తరించనుండగా, 2,121 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 52 లక్షల మంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది.

అరక్కోణం–రేణిగుంట మూడో, నాలుగో లైన్ ప్రాజెక్టుతో తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో రైల్వే సామర్థ్యం పెరగనుంది. తిరుపతి యాత్రికులకు, చెన్నై–తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్యాకేజీలో తమిళనాడుకు మూడు ప్రధాన ప్రాజెక్టులు లభించాయి. హోసూరు–ఓమలూరు, సేలం–కరూర్–దిండిగల్ డబ్లింగ్‌తో పాటు అరక్కోణం–రేణిగుంట మార్గంలోనూ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

వైట్‌ఫీల్డ్–బంగారపేట 3వ, 4వ లైన్‌తో పాటు హోసూరు–ఓమలూరు మార్గంలోని కర్ణాటక భాగంలో రైల్వే సామర్థ్యం పెరిగి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో రద్దీ తగ్గనుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఆమోదించిన ఐదు ప్రాజెక్టులతో ఏటా 47 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం ఏర్పడనుంది. దీని వల్ల దేశంలో లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా, సుమారు 8 కోట్ల లీటర్ల చమురు ఆదా అవుతుందని కేంద్రం తెలిపింది. 

అలాగే 42 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గి, దాదాపు 2 కోట్ల చెట్లు నాటినంత పర్యావరణ ప్రయోజనం చేకూరనుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలోని తూర్పు, మధ్య భారత రాష్ట్రాలకు కూడా కేంద్ర కేబినెట్ మరో రూ.10,783 కోట్ల విలువైన మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఖరగ్‌పూర్–ఝార్సుగుడా (బగ్దేహి) నాలుగో లైన్, కట్నీ–పేంద్ర రోడ్ నాలుగో లైన్, బిలాస్‌పూర్ (ఉస్లాపూర్)–పేంద్ర రోడ్ మూడో లైన్ ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 656 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విస్తరించడంతో పాటు 4,790 గ్రామాల్లోని దాదాపు 56 లక్షల మంది ప్రజలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభించనుంది.