అమెరికాలో నిల్వ చేసిన ట‌న్నుల కొద్దీ బంగారం ఐరోపాకు తరలింపు

అమెరికాలో నిల్వ చేసిన ట‌న్నుల కొద్దీ బంగారం ఐరోపాకు తరలింపు
సుదీర్ఘకాలంగా అమెరికాలో నిల్వచేస్తున్న బంగారాన్ని టన్నుల కొద్ది ఇప్పుడు ఐరోపా దేశాలు వరుసగా వెన‌క్కి తెప్పించుకుంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో నెద‌ర్లాండ్స్ చేరింది. ఇటీవ‌ల ఫ్రాన్స్ కూడా త‌మ బంగారాన్ని అమెరికా నుంచి వెన‌క్కి తెప్పించుకుంది.  ఇటీవ‌ల డ‌చ్ సెంట్ర‌ల్ బ్యాంకు డీ నెద‌ర్లాండ్సీ బ్యాంక్ సుమారు 86 ట‌న్నుల బంగారాన్ని అమెరిస‌కా, కెన‌డా నుంచి లండ‌న్‌కు మార్చేసింది. 
 
మార్చి, ఆగ‌స్టు నెల‌ల్లో ఆ ఆప‌రేష‌న్ సాగిన‌ట్లు తెలిసింది.  “తీవ్రమైన సంక్షోభాలకు మరింత మెరుగ్గా సిద్ధంగా ఉండటానికి” తమ బంగారు నిల్వలను తరలించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ (డీఎన్‌బీ) తెలిపింది. కానీ, ఏ సంక్షోభాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందో స్పష్టంగా చెప్పనప్పటికీ, అమెరికా ప్రస్తుతం కెనడాతో తీవ్రమైన వాణిజ్య సుంకాల యుద్ధంలో నిమగ్నమై ఉంది. అదే సమయంలో, వాషింగ్టన్ ఇరాన్‌పై యుద్ధం చేస్తూ, ఇటీవలి నెలల్లో వెనిజులా, క్యూబా చుట్టుపక్కల కార్యకలాపాలకు నాయకత్వం వహించింది. 

అంతేకాకుండా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఐరోపా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ యుద్ధంలో చేరడానికి ఐరోపా మిత్రదేశాలు విముఖత చూపడం పట్ల ట్రంప్ తన అసంతృప్తిని తెలియజేశారు. బ‌హుశా ఈ బంగారాన్ని వాడుతామ‌ని అనుకోవ‌డం లేద‌ని, కానీ త‌మ‌కు తాము బ‌లోపేతం కావ‌డం కోసం ముంద‌స్తుగా వెన‌క్కి తెచ్చేసుకున్నామ‌ని డీఎన్‌బీ ప్రెసిడెంట్ ఓలాఫ్ స్లీజ్‌పెన్ తెలిపారు. 

సుమారు 83.8 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన 612.4 ట‌న్నుల బంగారం అమెరికా వ‌ద్ద ఉన్న‌ట్లు నెద‌ర్లాండ్స్ చెప్పింది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న నిల్వ‌ల్లో అమెరికా వ‌ద్ద 31.3 శాతం, ఒట్టావోలో 19.7 శాతం, జీస్ట్‌లో 30.8 శాతం, లండ‌న్‌లో 18.1 శాతం బంగారం ఉన్న‌ట్లు నెద‌ర్లాండ్స్ చెప్పింది. తాజా చ‌ర్య‌తో లండ‌న్‌లో నెద‌ర్లాండ్స్ బంగారం షేర్ 32.1 శాతానికి పెరిగింది. అమెరికా నుంచి 86 ట‌న్నుల బంగారాన్ని నెద‌ర్లాండ్స్ ఖాళీ చేసింది. 
 
కానీ అదేమీ భౌతికంగా తీసుకెళ్లలేదు. సుమారు 59 ట‌న్నుల బంగారాన్ని అమెరికాలోనే అమ్మేసి, ఆ మేరకు లండ‌న్‌లో ఆ బంగారాన్ని తీసుకున్న‌ది. ఇక 27 ట‌న్నుల బంగారాన్ని మాత్రం అమెరికా, కెన‌డా నుంచి స్వంత ప‌ట్ట‌ణం జీస్ట్‌కు తీసుకెళ్లింది.   ఈ మ‌ధ్యే ఫ్రాన్స్‌తో పాటు జ‌ర్మ‌నీ కూడా త‌మ బంగారాన్ని వెన‌క్కి తెచ్చుకున్న‌ది. 
 
జ‌ర్మ‌నీకి చెందిన బుందేస్‌బ్యాంక్ సుమారు 216 ట‌న్నుల బంగారాన్ని బదిలీ చేసుకున్న‌ది. న్యూయార్క్ నుంచి 111 ట‌న్నులు, పారిస్ నుంచి 105 ట‌న్నుల బంగారాన్ని జ‌ర్మ‌నీ వెన‌క్కి తీసుకువ‌చ్చింది.  వాణిజ్య, సైనిక యుద్ధాల కారణంగా దేశాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటూ, తమ బంగారాన్ని తమ దేశంలోనే దాచుకుంటున్న తరుణంలో, ప్రపంచం ఎదుర్కొంటున్న అస్థిరమైన, అనిశ్చితమైన స్థితికి ప్రతిస్పందనగానే ఈ చర్య స్పష్టంగా కనిపిస్తుంది. 

యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కొన్ని దేశాలు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియ‌ర్ మార్కెట్ స్ట్రాట‌జిస్ట్ జోసెఫ్ క‌వ‌టోని తెలిపారు. ద్ర‌వ్యోల్బ‌ణం, వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో బంగారంతో వాణిజ్యం చేయాల‌న్న యోచ‌న‌లో ప‌లు దేశాలు ఆ నిల్వ‌ల‌ను వెన‌క్కి తెస్తున్నాయి.

బంగారం విక్ర‌యం కోసం లండ‌న్‌ను సుర‌క్షిత‌మైన ప్రాంతంగా భావిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగారం ట్రేడింగ్ లండ‌న్ నుంచి సాగుతున్న‌ది. సంక్షోభ సమయంలో వేగంగా బంగారం కొనాలన్నా లేదా అమ్మాలన్నా లండన్ సరైన ప్రదేశం; అందుకే ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’ బంగారం నిల్వ చేయడానికి ఒక ప్రముఖ కేంద్రంగా మారింది.

300 ఏళ్ల క్రితం నాటి ఆ బ్యాంకులో సుమారు 4 ల‌క్ష‌ల బంగారం క‌డ్డీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వాటి విలువ 200 బిల‌య‌న్ల పౌండ్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వేల సంవ‌త్స‌రాల‌ నుంచి బంగారాన్ని పెట్టుబ‌డిగా భావించ‌డం వ‌ల్ల‌ ఆ విలువైన లోహం ఖ‌రీదు కూడా క్ర‌మంగా పెరుగుతోంది.  వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, గత నాలుగేళ్లుగా కేంద్ర బ్యాంకులు ఏటా సగటున 1,000 టన్నుల బంగారాన్ని పోగుచేస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఉన్న ప్ర‌పంచ సంక్షోభాల నేప‌థ్యంలో ఆ బంగారాన్ని త‌మ ద‌గ్గ‌రే దాచుకోవాల‌న్న త‌ప‌న కూడా ప‌లు దేశాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.నియంత్ర‌ణ లేని రీతిలో బంగారం ధ‌ర పెర‌గ‌డం వ‌ల్ల ఆయా దేశాలు త‌మ బంగారాన్ని తిరిగి తెచ్చేసుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

బంగారం కొరత, వేల సంవత్సరాలుగా దీనికి ఉన్న విలువ కారణంగా, ఇది పెరుగుతున్న ధరలను కొంతవరకు తట్టుకుంటుంది.  అందువల్ల దీనిని ఒక మంచి పెట్టుబడిగా పరిగణిస్తారు. పెట్టుబడి బ్యాంకు చార్లెస్ ష్వాబ్ ప్రకారం, “గత అర్ధ శతాబ్దంలో, ద్రవ్యోల్బణాన్ని అత్యంత నిశితంగా గమనించే కొలమానమైన వినియోగదారుల ధరల సూచిక కంటే బంగారం ధరలు చాలా వేగంగా పెరిగాయి.”

బంగారం కొనుగోళ్లలో దూకుడు పెంచిన చైనా

మరోవంక, చైనా భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం ఆసక్తి కలిగిస్తున్నది. గడిచిన 22 నెలలుగా ఏకంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. రాబోయే దశాబ్ద కాలం కోసం పక్కా వ్యూహంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు భారీ ప్రణాళికను అమలు చేస్తోందట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను ముందే పసిగట్టి తన ఖజానాను పటిష్టం చేసుకుంటోంది. 
 
గత నెలలో చైనా కొన్న 6.5 లక్షల ఔన్సుల బంగారం 2023 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యధిక కొనుగోలుగా రికార్డుల్లోకెక్కింది. దీంతో ఆ దేశం వద్ద ఉన్న మొత్తం అధికారిక బంగారం నిల్వలు 7.67 కోట్ల ఔన్సులకు చేరాయి.  సాధారణంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా ఆగుతారు. కానీ చైనా మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతుండటమే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గతంలో ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 72 శాతం ఉండేది. ఇప్పుడది దాదాపు 55 శాతానికి పడిపోయింది. డాలర్ క్రమంగా తన పట్టు కోల్పోతుండటంతో ఇతర దేశాలు కూడా ప్రత్యామ్నాయాల వైపు వేగంగా దృష్టి పెడుతున్నాయి.  మార్కెట్ విలువ పరంగా చూస్తే 1990 తర్వాత అమెరికా ప్రభుత్వ బాండ్లను దాటి బంగారం మొదటి స్థానానికి చేరింది. భద్రత కోసం డాలర్ ఆస్తులపై ఆధారపడటం కంటే పసిడిని నిల్వ చేసుకోవడమే మేలని సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి. కేవలం చైనా మాత్రమే కాకుండా పలు ప్రధాన దేశాలు ఇదే బాటలో నడుస్తున్నాయి.
 
ఇంకో ఏడాదిలో తమ వద్ద ఉన్న పసిడి నిల్వలను మరింత పెంచుకుంటామని 45 శాతం కేంద్ర బ్యాంకులు స్పష్టం చేశాయి.   డాలర్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా దేశాలు భరోసాను వెతుక్కుంటున్నాయనే విషయం స్పష్టమవుతోంది. భవిష్యత్ ఆర్థిక సంక్షోభాల నుంచి తప్పించుకునేందుకు బీజింగ్ తీసుకుంటున్న ఈ ముందస్తు రక్షణ చర్యలు ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నాయి.