బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్ 

బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్ 
 
* స్పీకర్‌ గడ్డం ప్రసాద్​ కుమార్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు
 
రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు చర్యలకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. అనంతరం నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  శాసనసభ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు మేరకు సెక్షన్లు 352 రెడ్‌ విత్‌ 3(5), ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద సైఫాబాద్​ పోలీస్​ స్టేషన్​లో ఇద్దరు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీలపై కేసు నమోదైంది. 
 
సోమవారం బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కూడిన టీషర్ట్​లు ధరించి అసెంబ్లీ గేటు లోపలికి వెళ్లడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహంతో రెచ్చిపోయి స్పీకర్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, అసెంబ్లీ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమక్షంలో మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డి స్పీకర్‌పై వాగ్వాదానికి దిగారని ఎఫ్ఐఆర్ ఆరోపిస్తోంది.
మధుసూదన్ స్పీకర్‌ను దూషించారని, అవమానకరమైన భాషను ఉపయోగించారని, స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికారం ఎవరికి ఉందని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్‌ను అవమానించి, కించపరిచే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీ ప్రాంగణంలోని ప్రజలు చూసే ప్రదేశంలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు, మీడియా ప్రసారాలను కూడా ఎఫ్ఐఆర్ ప్రస్తావిస్తోంది. 
మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంతంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీ తాతా మధును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది.  పోలీసుల చర్యను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  స్పీకర్ అనుమతి లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ తాతా మధును అరెస్టు చేసి తరలించారు.
అరెస్ట్ అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. తాను ఎక్కడా అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తనను తాను రక్షించుకునే క్రమంలో, ఆత్మరక్షణ ధోరణిలో మాత్రమే మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.
శాసనసభ గేట్‌ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ సోమవారమే  వివరణ ఇచ్చారు. స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో సహచర ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, దాసోజు శ్రవణ్‌, దేశపతి శ్రీనివాస్‌, ఎంసీ కోటిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఘటన జరిగిన తీరును తాతా మధు వివరించారు.
 
మహిళా శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కూడా దాడి జరిగిందని తెలిపారు. “నాపై దాడి చేసి ప్యాంటు లాగేందుకు ప్రయత్నించారు. గొంతు నొక్కుతూ చెప్పడానికి వీలులేని రీతిలో దుర్భాషలాడుతూ, తొడల్లో పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యా. ఈ సందర్భంగానే అక్కడ దాడికి యత్నంచిన అధికారులను నిలదీసిన.  నాపై దాడి చేసింది ఎవరు? ప్యాంటు లాగేందుకు ప్రయత్నించింది ఎవరు? అలా చేయమని ఎవరు ఆదేశించారని అక్కడున్న పోలీసులను ఉద్దేశించే ఆగ్రహం వ్యక్తం చేశా” అని తెలిపారు. 
 
“కానీ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. స్పీకర్‌ వ్యవస్థపై, వ్యక్తిగతంగా స్పీకర్‌పైనా తనకు ఎంతో గౌరవముంది. స్పీకర్‌ను ఉద్దేశించి ఒక మాట అనలేదు. అయినప్పటికీ నేను అనని మాటలను నాకు ఆపాదించడం సరికాదు. ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్టు భావిస్తే, ఆ మాటలను ఉపసంహరించుకుంటున్న. అందుకు విచారం వ్యక్తం చేస్తున్న” అని తాత మధు వివరించారు.

కాగా, హైదరాబాద్ కోకాపేటలోని నవీన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్న పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిలదీశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఎవరు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు.  మాయమాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నించాలని భావిస్తే తమను సభలోకి ప్రవేశించకుండా అక్రమంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి, హామీల అమలుపై నిలదీస్తామనే భయంతోనే తమపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  నవీన్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన భార్య లక్ష్మీ అడ్డుపడ్డారు. అక్రమంగా అరెస్టు చేయవద్దని పోలీసులను కోరారు. అయినప్పటికీ బలవంతంగా అరెస్టు చేస్తుండగా ఆమె స్వయంగా వీడియోలు తీశారు.