తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. తాజా షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 19న కాకుండా నవంబర్ 9న ప్రచురితం కానుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత గడువు పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా షెడ్యూల్‌ను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
ఓటర్లు తమ పేర్లకు సంబంధించి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేసేందుకు గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అలాగే క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసుల జారీ, విచారణ, పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగించనున్నారు. సుమారు 93 లక్షల మంది ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందాయి. అనంతరం తుది ప్రక్రియ పూర్తిచేసి నవంబర్ 9న సవరించిన ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమైంది. తొలుత జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించాల్సి ఉండగా, జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేసి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించారు. అయితే జూలై 15న తొలి సవరణలో బీఎల్వోల ఇంటింటి పర్యటనలను ఆగస్టు 3 వరకు పొడిగించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలను ఆగస్టు 10కు, తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 12కు మార్చారు.
అనంతరం ఆగస్టు 1న రెండోసారి షెడ్యూల్‌ను సవరించి బీఎల్వోల ప్రక్రియను ఆగస్టు 10 వరకు, డ్రాఫ్ట్ జాబితా విడుదలను ఆగస్టు 17కు, తుది జాబితాను అక్టోబర్ 19కు వాయిదా వేశారు. అక్టోబర్ 1నే అర్హత తేదీగా కొనసాగించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 29న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల కోసం నెల రోజుల సమయం సరిపోదని, ఇంత పెద్ద స్థాయిలో సవరణ చేపడుతున్నందున మరో నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర సీఈవో సైతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి మూడు వారాల అదనపు గడువు కోరారు. జూన్ 10 నాటికి తెలంగాణ ఓటర్ల జాబితాలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వీరిలో 73.39 లక్షల ఎంట్రీలు అంటే 21.7 శాతం వరకు గైరాజరు, నివాసం మార్పు, మృతి, డూప్లికేట్ కేటగిరీల్లో గుర్తించినట్లు వివరించారు. మొత్తం 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ చేయగా, 60.50 లక్షల ఫారాల్లో వివిధ రకాల అనుమానాస్పద అంశాలు, మరో 32.36 లక్షల ఫారాల్లో 2002 ఓటర్ల జాబితాతో లింక్ లేకపోవడం వంటి అంశాలు గుర్తించినట్లు తెలిపారు.

More Stories
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన
అసెంబ్లీలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు