నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక

నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ ప్రదానోత్సవ వేదిక చరిత్రలోనే తొలిసారిగా దేశ రాజధాని న్యూఢిల్లీని దాటి వెళ్లనుంది. 
 
ఈనెల 22న జరగనున్న ఈ ఈవెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని విజేతలకు అవార్డులు అందజేసే  72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన ఉన్న ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ‘ఏక్తా నగర్’ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణం)లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
1954లో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. అప్పట్నుంచి దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో విజేతలకు అవార్డులు అందజేస్తున్నారు.  భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు అవార్డులను స్వయంగా అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి తొలిసారిగా వేదికను ఢిల్లీ బయటకు మార్చారు. 2026 అవార్డుల ఈవెంట్కు గుజరాత్ కెవాడియా వేదిక కానుంది.

 మరో విశేషమేమిటంటే ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ రూపొందించిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ డాక్యుమెంటరీకి నాన్-ఫీచర్ విభాగంలో ఉత్తమ దర్శకత్వం అవార్డు లభించింది. ఇప్పుడు సరిగ్గా అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కొలువుదీరిన ఏక్తా నగర్‌లో అవార్డుల వేడుకను జరపాలని ప్రతిపాదించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా, ఈ ఏడాది జులైలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేషనల్ అవార్డ్స్ విజేతలను ప్రకటించింది. 2024 డిసెంబర్ వరకు సెన్సార్ అయిన సినిమాలను సంబంధించి అవార్డులు ప్రకటించారు. ఇందులో ఉత్తమ నటుడుగా మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి (భ్రమయుగం), కార్తిక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) ఇద్దరు సంయుక్తంగా ఎంపికయ్యారు. ‘బ్రహ్మయుగం’, ‘చందు ఛాంపియన్’ చిత్రాల్లో వారి నటనకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ నటి అవార్డు యామి గౌతమి (ఆర్టికల్ 370)ను వరించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపికయింది. 

అలాగే ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా ఎంపికయ్యారు. ప్రభాస్ నటించిన తెలుగు సైన్స్‌ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా అవార్డు అందుకోనుంది. తమిళ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’కు జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఢిల్లీకి పరిమితమైన జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకను తొలిసారి గుజరాత్‌కు తీసుకురావడం భారతీయ సినిమా వైవిధ్యాన్ని దేశవ్యాప్తంగా ప్రతిబింబించే కీలక పరిణామంగా నిలవనుంది.