* గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తాం.. జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ధరణి, భూభారతి పేరుతో వివాదాస్పద 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చిన లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వేదికగా తాము చేపట్టిన పోరాటాన్ని అణచివేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు.
ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తున్నందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ ముట్టడికి నడుం బిగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా లాఠీలతో విరుచుకుపడ్డారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా కార్యకర్తలు, నాయకులను అక్రమంగా నిర్బంధించారని, జిల్లాల్లో ముందస్తు హౌస్ అరెస్టులు చేశారని వివరించారు.
ఈ రెండు ప్రధాన ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బీజేపీ చర్చ లేవనెత్తకుండా ఉండేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒకరు నల్ల బట్టలు, మరొకరు తెల్ల బట్టలు వేసుకుని ఒకరిపై ఒకరు డ్రామాలు ఆడుతూ అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
అయితే సభలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ముఖమే చూడరని, అధికార పార్టీ ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులను మాట్లాడనివ్వదని, మరి ప్రజల బాధలను ఎవరు వినిపించాలని రాంచందర్ రావు నిలదీశారు. ఈ ప్రజా ఉద్యమం ఇక్కడితో ఆగేది లేదని, సభ లోపల బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై సర్కార్‌ను నిలదీస్తారని, సభ వెలుపల రోడ్లపై ప్రజల పక్షాన తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ నిరంకుశ పోకడలపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి నివేదిక కోరిందని, వారికి అన్ని వివరాలు అందజేశామని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై మంగళవారం గవర్నర్ గారిని కలిసి సమగ్ర వినతిపత్రం అందజేస్తామని, అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను చేపట్టి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయించేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం 22-ఏ భూ సమస్యలను పరిష్కరించేంత వరకు బీజేపీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

More Stories
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు అక్టోబరు 7 వరకు పొడిగింపు
ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన