తెలంగాణ శాసనసభ సమావేశాలు మొదటి రోజే 22ఏ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో అసెంబ్లీలోకి ప్రవేశించడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపల ప్లకార్డులు ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, గతంలోనే ఇలా చేయవద్దని చెప్పామని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు.
ప్లేకార్డులను మార్షల్స్‌కు అప్పగించాలని, లేకుంటే బలవంతంగా బయటకు పంపిస్తామని హెచ్చరించారు. 22ఏపై చర్చించే అంశంపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై చర్చిద్దామని, అయితే సభ సజావుగా జరగాలంటే ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా 22ఏపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
22ఎ నిషేధిత కేటగిరీలో అనేక భూములు, ఆస్తులను చేర్చడంపై న్యాయ విచారణ జరపాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో, స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే, జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డిని తన ప్రశ్న అడగమని స్పీకర్ కోరారు. అయితే, ప్లకార్డులు పట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు, 22ఎ వివాదంపై ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని పట్టుబట్టారు. వారు వెల్ వైపు దూసుకెళ్లారు.
22 ఏ అంశంపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారని, ప్రొసీజర్ ఎలా ఉంటే అలా సభ నడవాలని సూచించారు. బీఏసీలో నిర్ణయించి 22ఏ పై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మొదట లఘు చర్చ 22ఏ పైనే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రశ్నోత్తరాలను నడవనివ్వాలని కోరారు.
అయితే భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వివాదాస్పద 22ఏ భూముల నిరోధక జాబితా అంశంపై శాసనసభలోనే సమగ్రంగా చర్చ జరిపి, తగిన నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా చర్చల్లో పాల్గొనకుండా ఆందోళనలు చేయడం సరికాదని హితవు పలికారు.
సభలో ప్రతిపక్షాల వ్యవహారశైలిని తప్పుపడుతూ, బీజేపీ తన ‘చీకటి మిత్రుడిని’ (గత ప్రభుత్వాన్ని/బీఆర్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ) కాపాడుకోవడానికి పరోక్షంగా ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల వద్ద ఉన్న ప్లకార్డులను తీసివేయమని స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు. వారు నినాదాలు కొనసాగిస్తుండటంతో, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఒక్క ప్రశ్న కూడా అడగకముందే సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

More Stories
బిఆర్ఎస్ ఎమ్యెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డి అరెస్ట్
తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు అక్టోబరు 7 వరకు పొడిగింపు
ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన