తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది. తాతా మధుపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తాతా మధు కొనసాగుతున్నారు. సభ నుంచి తాతా మధును బహిష్కరించే యోచనలో మండలి చైర్మన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మధు వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను స్పీకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్ అన్న మర్యాద లేకుండా ఎవడ్రా స్పీకర్, ఎవడ్రా మీకు అధికారం ఇచ్చింది అంటూ ఏక వచన సంబోధన చేయటమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
అసెంబ్లీ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ బూతులు తిడుతూ, అమర్యాదకరంగా మాట్లాడటాన్ని మంత్రులు డి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు. మంత్రి సీతక్క స్పీకర్ ను దూషించిన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
శాసనసభాపతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సభాపతి స్థానాన్ని కించపరిచేలా వ్యవహరించిన తాతా మధును తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా ప్రజలకు, సభకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.
తాతా మధు వాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేలందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఏలేటి తెలిపారు. “తాతా మధు కావాలని అలా మాట్లాడారా? లేక వెనుక ఎవరైనా ఉండి ఆయనతో అలా మాట్లాడించారా? అన్నది తేలాలి” అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానాన్ని అవమానించే సంస్కృతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఎస్సీ స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
More Stories
యువమోర్చ ధర్నాకు అనుమతి నిరాకరించడంతో అసెంబ్లీ ముట్టడి!
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల కర్కశత్వం
హైదరాబాద్‌లో ‘అహింసా స్థూపం’ ఆవిష్కరించిన కిషన్ రెడ్డి