* ఎమెస్కో ప్రచురణగా రూపుదిద్దుకున్న అరుదైన శాసనసభా ప్రసంగాల సంకలనం!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో శాసన సభా నిర్వహణలో తనదైన చెరగని ముద్ర వేసిన నాయకుడు, మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభా ప్రసంగాలు త్వరలోనే అక్షర రూపంలో మన ముందుకు రాబోతున్నాయి. సభా రికార్డుల్లో మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్రతిష్టాత్మక గ్రంథాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో’ అత్యున్నత ప్రమాణాలతో ముద్రిస్తున్నది.
రూల్ బుక్‌ను క్షుణ్ణంగా ఔపోసన పట్టిన మేధావిగా సభా నిబంధనలకు సంపూర్ణంగా కట్టుబడుతూనే, ఎంతటి బలమైన ప్రభుత్వాలనైనా నిలదీసిన తీరు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లు, రూలింగ్‌లపై ఆయన వెలువరించిన చారిత్రాత్మక తీర్పులు నేటికీ అసెంబ్లీ రికార్డుల్లో ప్రామాణికంగా నిలిచాయి.
సతీమణి జయశ్రీ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కూడిన కుటుంబంలో మంథనితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చివరివరకు వీడని శ్రీపాదరావు, ఏప్రిల్ 13, 1999న 62వ ఏట నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు. కానీ, “అర్ధరాత్రి తలుపు కొట్టినా స్పందించే నైజం” కలిగిన ప్రజానురంజక నాయకుడిగా, నిష్పాక్షిక స్పీకర్‌గా ప్రతిపక్షాల హక్కులకు అభయం ఇచ్చే రక్షణ కవచంలా ఇప్పటికీ ఆయన ప్రజల మనసులో నిలిచిపోయారు.
చట్టసభల్లో చర్చల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేటి యుగంలో, మైకు దొరకగానే ఎంత గట్టిగా మాట్లాడామనే దానికంటే ఆ మాట వెనుక ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలో నేర్పించేలా ఈ ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి‘ ఒక ‘కోర్సు బుక్’ లా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీ పాదరావు తనయుడు డి. శ్రీదర్ బాబు ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన కూడా తండ్రిలాగే మృదుస్వభావంతో, విషయపరిజ్ఞానంతో ప్రజాసేవలో కొనసాగుతున్నారు. శ్రీపాద రావు ప్రసంగాలకు అక్షర రూపమిస్తూ ఎమెస్కో అందిస్తున్న ఈ ‘‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి’’ వర్తమాన శాసనసభ్యులకు, భవిష్యత్ యువ నాయకులకు, ప్రజాస్వామ్యంపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ఒక దిక్సూచిగా నిలవనుంది.

More Stories
`భిన్నత్వం సహజం..ఐక్యతే సత్యం’ చాటి చెప్పడమే హిందూ రాష్ట్ర లక్ష్యం
ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం.. ఆరుగురు మృతి
2029 నాటికి మాదకద్రవ్య రహిత దేశంగా భారత్