భూ భారతి చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో రెండు రోజుల మహాధర్నా శనివారం ప్రారంభమైంది. బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ మహాధర్నాలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు హాజరయ్యారు.
తమ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించి, రెవెన్యూ రికార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు చెందిన ప్రైవేట్ భూములను సెక్షన్ 22ఏ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. అర్హత ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ పోర్టల్‌లో నమోదైన వివరాలను పరిశీలించి, తప్పులు ఉంటే సరిచేయాలని డిమాండ్ చేశారు.
సెక్షన్ 22ఏ పరిధిలోకి వచ్చిన భూములన్నింటినీ సమీక్షించి, నిషేధిత జాబితాలో ఉంచాల్సిన అవసరం లేని ఆస్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల భూములపై ఉన్న విధానమే భవిష్యత్తులో రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి, వాస్తవ యజమానుల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. భూ రికార్డుల్లో తప్పులు, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిచేసి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేసింది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి కూడా వెనుకాడబోమని ప్రకటించారు.
భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలోనూ ధరణి పేరుతో భూములు దోచుకున్నారని చెబుతూ 22ఎ కింద వారి భూములు పెట్టిన విషయం చాలా మంది ప్రజలకు తెలియదని, 22ఎ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని విమర్శించారు. పట్టాలు అనుమతులు ఉన్న భూములను కూడా 22ఎ కింద పెట్టారని, ప్రజల భూములను దోచుకోవడమే కాదు, ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని మండిపడ్డారు.
కమ్యూనిటీ హాల్స్, పార్కుల కోసం పెట్టిన భూములను కూడా ప్రభుత్వం అమ్మేస్తోందని, ఈ రాష్ట్రంలో భూములను అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ తప్ప అన్ని రకాల భూములను అమ్మేందుకు సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోందని, తెలంగాణ నుంచి ఢిల్లీకి రూ. వేలాది కోట్లు కప్పం కడుతున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే అని పేర్కొంటూ ఒకే రీతిలో దోచుకుంటున్నాయని, అధికార పార్టీ నేతలు రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చేశారని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే డబ్బు వెళ్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు మాట్లాడుతూ, భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో రాష్ట్రంలో ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను, రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో ఒక బ్లాక్‌లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వ్యవస్థను అప్పగించి అవకతవకలకు పాల్పడితే, ఆ లోపాలను సరిదిద్దేందుకు భూభారతి తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ఘోరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో 15 శాతం కమీషన్లతో నిషేధిత జాబితాలోని భూములను తొలగిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వేసిన కోదండరాం కమిటీ వంటి వాటితో కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజలపై రుద్దుతున్నారని పేర్కొంటూ తప్పు జరిగిందని ముఖ్యమంత్రి, మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ధరణిని మార్చి భూభారతి తీసుకొస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు పేరు మాత్రమే మారింది, దోపిడీ విధానం మారలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అదే విధానం, అదే ఫార్మాట్‌తో భూభారతి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల భూములను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన భూములను 22ఏలో చేర్చారు? ఏ ప్రాతిపదికన కొన్ని భూములను రాత్రికి రాత్రే 22ఏనుంచి తొలగిస్తున్నారు? దీనిపై బీజేపీ ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బదలాయింపు జరుగుతున్నాయని తాము ఆధారాలతో ప్రశ్నించామని పేర్కొంటూ ఆస్తుల బదలాయింపు ఏ విధంగా జరిగింది? ఆ వ్యాపారానికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ వంటి కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి అదే సమయంలో వ్యాపార ప్రయోజనాలు కొనసాగించడం ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కాదా? అని నిలదీశారు. తాము ఈ ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం కోరితే మంత్రి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, శ్రీమతి డి.కె. అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, ఎమ్మెల్సీ కొమురయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More Stories
యూకే పర్యటనలో గురుద్వారా సందర్శించిన మోహన్ భగవత్
బెంగాల్లో 1000 విద్య భారతి పాఠశాలల ఏర్పాటు
తెలంగాణలో మహిళలకు రక్షణ కరువు