క్రమశిక్షణ ఉల్లంఘించిన సీఎం, అవినీతి ఆరోపణలతో మంత్రులు!

క్రమశిక్షణ ఉల్లంఘించిన సీఎం, అవినీతి ఆరోపణలతో మంత్రులు!
 
* కాంగ్రెస్ అధిష్టానం పట్ల ధిక్కార ధోరణిలో కొండా సురేఖ!  
 
విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పటి నుండి తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కుమార్తెను ఖండించక పోవడంతో కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె నేరుగా ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం పట్ల కూడా ధిక్కార ధోరణి ప్రదర్శించడం విస్మయం కలిగిస్తోంది.  సీఎం క్యాంపు కార్యాలయం సిద్ధం చేసిన ముందస్తు స్రిప్ట్‌ను క్రమశిక్షణా కమిటీ యథాతథంగా ఏఐసీసీ పెద్దల చేతుల్లో పెట్టడం, దానికి పీసీసీ అధ్యక్ష పీఠం సైతం వత్తాసు పలకడంతో ఆమెపై వేటు ఖాయం అని అందరూ భావించారు. 
 
పైగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షీనటరాజన్‌ మౌనం, పార్టీ వ్యవస్థాగత ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెరవెనుక నడిపిన మంత్రాంగం అంతా కలిసి సురేఖపై క్రమశిక్షణ చర్యకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటివరకు కొండా సురేఖను రాజీనామా చేయాలని ఎవరూ నేరుగా అడగనప్పటికీ, ఆమెను తొలగించడానికి అవసరమైన అన్ని కాగితాలను సిద్ధం చేసినట్టు, అధిష్ఠానం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉన్నట్లు అందరూ భావించారు. 
 
ఢిల్లీ వెళ్లిన కొండా సురేఖను రోజంతా ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో మకాం వేసినా ఆమెను కలిసేందుకు కేసి వేణుగోపాల్ నిరాకరించడం, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహితం మొక్కుబడిగా కలిసి పంపించడంతో సాయంత్రంకల్లా ఆమెను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేస్తున్నట్లు బుధవారం అందరూ భావించారు.  అయితే, తనపై జరుగుతున్న కుట్రలను ముందే పసిగట్టిన కొండా సురేఖ ఢిల్లీ గడ్డపైనే ప్రతిఘటనకు దిగారు.
రాజధాని వేదికగా మీడియా చిట్‌చాట్‌లో ఆమె తన కూతురు మాట్లాడిన దాంట్లో అక్షరం పొల్లు పోలేదని, అకడ జరుగుతున్న వాస్తవాలనే నిర్భయంగా చెప్పిందని సురేఖ బాహాటంగానే సమర్థించుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రుల కమీషన్ల దందా, నిధుల మళ్లింపులు, కొందరు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉన్నదని సూటిగా ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిపై చిన్న మాటకు కూడా క్రమశిక్షణా అస్త్రాలు ఝుళిపించే నాయకులు, కోట్లాది రూపాయల ఆరోపణలు ఎదురొంటున్న ఇతర మంత్రుల వద్దకు వచ్చేసరికి ఎందుకు కళ్లు మూసుకుంటారని నిలదీశారు. బీసీలకో న్యాయం, బడా వర్గాలకో న్యాయమా? అంటూ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు లేఖల ద్వారా సమగ్ర విషయాలను చేరవేసినట్టు తెలిసింది.

తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వటమే తప్పు అని అని పేర్కొంటూ అలా ఇవ్వాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డికే ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి అంటూ ఎదురు దాడి జరిపారు.

“నేను ఏ తప్పు చేయలేదు. అయినా నాపై చర్యలకు సిద్ధమవుతున్నారు. నా బిడ్డ మాట్లాడితే నాకేం సంబంధం. తనకు పెళ్లయి కుటుంబం ఉంది. ఆమె రాజకీయం ఆమెది. నా రాజకీయం నాది. తనకు ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది. ముందు సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితేనే తను స్పందించింది. అయినా అభ్యర్థులను ముందుగా సీఎం పరకాలలో ఎలా ప్రకటిస్తారు. తాను పదేళ్లు సీఎంగా ఉంటానని తనకు తాను ఎలా ప్రకటించారు. ఇది పార్టీ లైన్ క్రాస్ చేయటం కాదా? సీఎం అలా ప్రకటించుకోవటం పట్ల చాలా మంది మంత్రులు, సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు” అంటూ ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. 

 
అదేవిధంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలపై వచ్చిన కమీషన్ల ఆరోపణల మాటేంటని నిలదీశారు. తద్వారా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరితే తన దారి తాను చూసుకొంటానన్న సంకేతం ఇచ్చారు.  ఇదేసమయంలో తన బిడ్డ సుస్మితా పటేల్‌ ‘ప్లాన్‌ ఎ’ని అమలు చేసిందని, ఆమె ‘ప్లాన్‌-బి’ ఏమిటో తనకు తెలియదని అంటూ కొండా మురళి గతవారం చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలను కలవరంకు గురిచేస్తున్నాయి. 
 
మరో వైపు బుధవారం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డివర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు కాంగ్రెస్‌ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం. తెలంగాణలో మళ్లీ వైఎ్‌సఆర్‌ పాలన తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ `బిసి కార్డు’ను తెరపైకి తీసుకు రావడం ఆందోళలన కలిగిస్తున్నది. 
 
అవినీతి ఆరోపణలు గల మంత్రులపై చర్యలు తీసుకోకుండా, తనను మంత్రివర్గం నుండి ఎందుకు తొలగించాలి అనుకుటనున్నారు? అంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. “నేనో బీసీ బిడ్డను కాబట్టే ఇలా చేస్తున్నారు. నాకు బీసీల మద్దతు ఉంది. నాపై కుట్రలు చేస్తూ ఎమ్మెల్యేతో ప్రెస్‌మీట్లు పెట్టించి తిట్టించారు. ఇలా మంత్రిని తిట్టడం సరైందేనా? ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరా? నాపై చర్యలు తీసుకుంటే పార్టీకే నష్టం” అంటూ ఆమె పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు.
 
ఇప్పటికే పొరుగున కర్ణాటకలో బిసి ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తొలగించి డీకే శివకుమార్ కు ఆ పదవి ఇవ్వడం బీసీ వర్గ్లాలో ఆగ్రవేశాలకు దారితీస్తుంది. ఇప్పుడు మరో సీనియర్ బిసి మంత్రిని తెలంగాణాలో త్లగిస్తే దేశంలో బిసి జనగణనకై ఉద్యమించిన రాహుల్ గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం నుండి పంపించివేస్తే ఆమె మౌనంగా ఉండబోరని, ఎమ్యెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తారనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. 
 
సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు వర్గానికి చెందినవారు. ఈ రెండు కులాలు బీసీ సామాజిక వర్గాల్లో కీలక ప్రాతినిధ్యం కలిగినవే. తెలంగాణలో బీసీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సురేఖ విషయంలో రాజకీయంగా తప్పటడుగు వేస్తె రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఆమె స్థానంలో మరో బిసి మహిళను మంత్రిగా చేసినా ఆమెను అవమానకరంగా పంపించడం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.