ప్రసూతి సెలవులు ముగించుకుని తిరిగొచ్చిన ఒక మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) హోదాను తగ్గించినందుకు గాను ఒక ప్రైవేట్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా వేసింది. ఈ డబ్బు మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని, ఈ నష్టపరిహారంతో పాటు మరో రూ.1.5 లక్షలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. అంతటితో ఆగకుండా ప్రసూతి సెలవుల సమయంలో మహిళలకు లభించే చట్టబద్ధమైన రక్షణ కేవలం ఉద్యోగంలో కొనసాగడానికే పరిమితం కాదని, వారి వృత్తిపరమైన హోదా, ప్రమోషన్లు, కెరీర్ పురోగతికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఆమె సెలవులు ముగించుకుని తిరిగి ఉద్యోగంలో చేరగానే కంపెనీ ఆమెకు పాత హోదాను ఇవ్వకుండా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో కేవలం క్లరికల్ స్థాయి విధులను కేటాయించింది. దీనితో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆపై న్యాయవాది పారుల్ సింగ్ ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ సచిన్ దత్తా ప్రసూతి సెలవుల నుంచి తిరిగొచ్చే మహిళను ఆమె వెళ్లకముందు ఏ హోదాలో ఉందో అదే హోదాలో తిరిగి నియమించాలని తేల్చి చెప్పారు. ఒకవేళ సంస్థాగత కారణాల వల్ల ఆ పోస్టు అందుబాటులో లేకపోతే ఆమెకు లభించే జీతం, గ్రేడ్, బాధ్యతలు, మేనేజిరియల్ అధికారాలు, కెరీర్ అవకాశాలు ఏమాత్రం తగ్గకుండా దానికి సమానమైన హోదాను మాత్రమే కల్పించాలని స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందనే విషయాన్ని కూడా కోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. మాతృత్వ ప్రయోజనాల చట్టం గానీ, సామాజిక భద్రతా కోడ్ 2020 గానీ ప్రసూతి అనంతర రీ-ఇంటిగ్రేషన్‌కు సంబంధించి సమగ్రమైన నియమాలను అందించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.
దీనిపై ఆరు నెలల వ్యవధిలో స్పష్టమైన మార్గదర్శకాలు లేదా నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళల ఆరోగ్య పరిస్థితులకు తగినట్లుగా పనుల కేటాయింపు, హోదా రక్షణ, తల్లిపాలు పట్టే వసతి, ప్రతీకార చర్యల నుంచి రక్షణ కల్పించేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

More Stories
వచ్చే 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు
ఇథనాల్ శాతాన్ని వెల్లడించాలని కోరే పిటిషన్ తిరస్కరించిన `సుప్రీం’
టెలికాం రంగంలో చైనా కంపెనీల కట్టడి