ఏ వ్యక్తిగత చట్టమూ రాజ్యాంగానికీ అతీతం కాదు

ఏ వ్యక్తిగత చట్టమూ రాజ్యాంగానికీ అతీతం కాదు
* దేశ సమగ్రతతో ఆటలాడుతున్న ఏఐఎంపిఎల్బి …వీహెచ్‌పీ
 
రాజ్యాంగాన్ని, ఇస్లామిక్ చట్టాన్ని (షరియా) సమాన స్థాయికి తీసుకురావడం ద్వారా దేశ సమగ్రతతో ఆ సంస్థ “ఆటలాడుతోందని” ఆరోపిస్తూ, ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’ (ఏఐఎంపిఎల్బి) ప్రతిపాదించిన “రాజ్యాంగ,  షరియా పరిరక్షణ ఉద్యమాన్ని” విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) వ్యతిరేకించింది. “రాజ్యాంగాన్ని అంగీకరించండి, చట్టాన్ని పాటించండి, దేశాన్ని గౌరవించండి — ఇదే నిజమైన పరిరక్షణ,” అని ఆ సంస్థ పేర్కొంది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించేలా  ఏఐఎంపిఎల్బి  గత వారం ఈ ఉద్యమాన్ని ప్రకటించింది. ముస్లింలపై వివక్ష, రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనలను వివరిస్తూ ఒక సమగ్ర “శ్వేతపత్రం” విడుదల చేయనున్నట్లు కూడా ఆ సంస్థ తెలిపింది. రాజ్యాంగం కంటే ఏ వ్యక్తిగత చట్టం కూడా గొప్పది కాదని  వీహెచ్‌పీ కేంద్ర సంయుక్త కార్యదర్శి విజయ్ శంకర్ తివారీ స్పష్టం చేశారు. 
 
“ముస్లిం పర్సనల్ లా బోర్డ్ భారత రాజ్యాంగాన్ని షరియాతో పోల్చింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం,” అని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం, అన్ని మతాల ప్రజలకు సమాన హక్కులు ఉంటాయి. “కానీ షరియాను రాజ్యాంగంతో పోల్చడం దేశ సమగ్రతతో ఆటలాడటమే అవుతుంది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
భారత పౌరులుగా ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు ఉంటాయని, అయితే పౌరసత్వంతో పాటు దేశ చట్టాలను అంగీకరించడం, జాతీయ చిహ్నాలను గౌరవించడం, ఉమ్మడి పౌర స్మృతి  ఆశయాన్ని అర్థం చేసుకోవడం వంటి బాధ్యతలు కూడా ఉంటాయని తివారీ పేర్కొన్నారు.  ఏఐఎంపిఎల్బి  చేపట్టిన ఈ ప్రచారం “దేశానికి ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి ఉద్యమాలు లేదా కార్యకలాపాలు చేపట్టడానికి ఈ దేశంలో అనుమతి ఇవ్వకూడదు” అని ఆ సంస్థ తెలిపింది. 
 
“ఇలాంటి కుట్రలు అన్నీ జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా జరుగుతాయి. దేశం అప్రమత్తంగా ఉండాలి,” అని ఆయన హెచ్చరించారు. ముస్లింలు వేధింపులకు గురవుతున్నారని, మసీదులు, మదర్సాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, బుల్డోజర్లను కేవలం వారిపైనే ప్రయోగిస్తున్నారని, జాతీయ గీతం ‘వందేమాతరం’ వారి మతంపై దాడిగా పరిగణించబడుతుందని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పదేపదే సూచిస్తోందని ఆయన విమర్శించారు.
 
దీనిని ఆయన “అసంపూర్ణమైన, తప్పుదోవ పట్టించే చిత్రం”గా అభివర్ణించారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడాన్ని మత పరిరక్షణగా పొరపాటుగా భావించకూడదని ఆయన పేర్కొన్నారు. “చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది; చట్టవిరుద్ధమైన దానిని చట్టబద్ధమైనదిగా చిత్రీకరించి బాధితులుగా చెప్పుకోవడం తగదు,” అని ఆయన హితవు చెప్పారు.
 
అక్రమ కట్టడాల కూల్చివేత గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఎవరి అక్రమ కట్టడాలైనా కూల్చివేయబడతాయని స్పష్టం చేశారు. “కానీ ముస్లిం వర్గానికి చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తే, వారు తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుంటూ ముందుకు వస్తారు. ఇది ఇక సాగకూడదు,” అని ఆయన స్పష్టం చేశారు. వందేమాతరం గీతాన్ని గౌరవించడం ఏ మతంపైనైనా దాడి చేయడం ఎలా అవుతుందని తివారీ ప్రశ్నించారు.
 
తమ నాయకులు చేసే వ్యాఖ్యల ఆధారంగా భయానక వాతావరణాన్ని సృష్టించవద్దని ముస్లిం సమాజంలోని “చైతన్యవంతులైన వర్గానికి” ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగానికీ, షరియాకీ మధ్య సంఘర్షణ తలెత్తితే తాము దేనిని అనుసరిస్తారో — “రాజ్యాంగమా లేక షరియానా?” — స్పష్టం చేయాలని ఆయన ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న నాయకులను కోరారు.