పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎబివిపి నేత!

పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎబివిపి నేత!
పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని ఎబివిపి అభ్యర్థి అంకిత్ బిధాన్ 500కు పైగా ఓట్ల ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు. జింద్ ప్రాంతానికి చెందిన బిధాన్, ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా (రీసెర్చ్ స్కాలర్) ఉన్నారు. పంజాబ్ యూనివర్సిటీ చరిత్రలో వరుసగా రెండు పర్యాయాలు విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎబివిపి అత్యున్నత పదవిని (అధ్యక్ష పదవిని) గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 
 
ఈ ఏడాది అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ నెలకొంది. ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, విభాగ ప్రతినిధుల పదవులతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు ఎన్నికల్లోలకు కూడా ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగం  ఎన్‌ఎస్‌యూఐకి చెందిన గుర్మాన్ సింగ్ సిద్ధూ, ఆప్ మద్దతు ఉన్న ఏఎస్ఏపికి చెందిన ఆదిల్ బిర్ సింగ్, ఎబివిపికి చెందిన అంకిత్ బిధాన్,  సాత్ కు చెందిన దర్శ్‌ప్రీత్ సింగ్ మధ్య పోటీ జరిగింది. 
 
మరోవైపు, పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్, బిజెపిల మధ్య రాజకీయ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతుండగానే, విద్యార్థి సంఘాలు క్యాంపస్ స్థాయిలో ఆసక్తికరమైన పరిణామాన్ని చూపించాయి. పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అవి చేతులు కలిపాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి), శిరోమణి అకాలీ దళ్ మద్దతు ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) ఆదివారం పొత్తును ప్రకటించాయి. 
 
ఎబివిపి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, వారి తరపున తమ మద్దతుదారులను సమీకరించాలని ఎస్ఓఐ నిర్ణయించింది. ప్రయోజనాలు కలిసినప్పుడు ఎన్నికల సమీకరణాలు రెండు పక్షాలను ఎలా ఏకం చేయగలవో ఈ క్యాంపస్ విభాగాల మధ్య కుదిరిన పొత్తు నిరూపిస్తోంది. అర్హతకు సంబంధించిన వివాదం కారణంగా తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడటంతో, ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఎస్ఐఓ పోటీ చేయలేదు.