ఒంటరిగా ఉన్న నర్సు హత్య.. ఆ తర్వాత అత్యాచారం

ఒంటరిగా ఉన్న నర్సు హత్య.. ఆ తర్వాత అత్యాచారం

హైదరాబాద్‌ సమీపంలోని పహాడీషరీఫ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక నర్సు దారుణ హత్యకు గురయ్యారు. తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు శుక్రవారం రాత్రి తన విశ్రాంతి గదిలో హత్యకు గురయ్యారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెను ప్రైమ్‌కేర్‌ ఆస్పత్రి సమీపంలోని ఒక మెకానిక్‌ షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా దారుణంగా హత్యచేసినట్లు గుర్తించి ఆదివారం అతడిని అరెస్టు చేశారు. 
 
పోలీసువర్గాల కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన మృతురాలు ఈఏడాది జనవరిలో తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్‌ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ పనిచేసే నర్సుల కోసం ఆస్పత్రికి కొద్దిదూరంలో యాజమాన్యం విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటోంది. 
 
ఆ గదిలో మృతురాలితోపాటు మరో నర్సు కూడా ఉంటుండగా, ఆమె ఆ సమయంలో విధుల్లో ఉంది. మిగతా గదుల్లోనూ ఎవరూ లేరు. అది గమనించిన నిందితుడు కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించాడు. మృతురాలు గమనించేలోపే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. భయకంపితురాలైన ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించటంతో సైనా ఉల్లా ఆమె గొంతు నులిమి, సుత్తితో కొట్టి దారుణంగా హత్యచేశాడు. 
 
శనివారం మరో నర్సు సారిక వచ్చి గది తలుపు తట్టగా తీయకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యానికి విషయం చెప్పింది. పోలీసులు గది కిటికీ ద్వారా లోపలికి వెళ్లి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది. ఆమె ముఖం, కాళ్లపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

హత్య తర్వాత అత్యాచారం?
నర్సును దారుణంగా హత్యచేసిన సైనా ఉల్లా ఆ తర్వాత మరింత ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని ఒక పోలీసు అధికారి తెలిపారు. రెండేళ్ల క్రితం కోల్‌కతాలోని ఆర్జీఖర్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో పీజీ విద్యార్థి హత్య తరహాలోనే ఈ ఘటన కూడా ఉందని పోలీసులు తెలిపారు.
2024 ఆగస్టు 10న రాత్రి ఆర్జీఖర్‌ ఆస్ప్రతిలో డ్యూటీ ముగించుకొని తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ విద్యార్థినిపై సంజయ్‌రాజ్‌ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో దారుణంగా కొట్టి చంపి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. నర్సు హత్యకు ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు విశ్రాంతి తీసుకొనే ప్రాంతంలో కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవటం వల్లే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రధాన రహదారిపై ప్రైమ్‌కేర్‌ ఆస్పత్రి ఉండగా, దానికి కొద్ది దూరంలో అదే రహదారి వెంట మెకానిక్‌ షెడ్లు ఉన్నాయి. వాటి వెనుకవైపు నర్సింగ్‌ సిబ్బంది కోసం ఆస్పత్రి యాజమాన్యం విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది. కానీ, ఆ గదుల కిటికీలకు గ్రిల్స్‌ బిగించలేదు. అల్యూమినియం స్లైడ్‌ డోర్లు మాత్రమే ఉన్నాయి. మృతురాలు ఆ కిటికీ గడియ పెట్టడం మర్చిపోవటంతో నిందితుడు తేలిగ్గా లోపలికి ప్రవేవించగలిగాడు. కిటికీలకు గ్రిల్స్‌ ఉంటే ఈ దారుణం జరిగేది కాదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పేదరికాన్ని ఎదిరించి నిలిచినా!
మృతురాలిది నిరుపేద కుటుంబం. అంకంపాలెంలోని ట్రైౖబల్‌ గురుకుల పాఠశాలలో పదోతరగతి వరకు చదివిన ఆమె.. భద్రాచలం గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసింది. అనంతరం హైదరాబాద్‌లో నర్సింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఆమె తండ్రి కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది.
 మృతురాలికి ఒక సోదరుడు ఉన్నాడు. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న అతడు కూడా గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కుటుంబానికి అండగా ఉండేందుకు ఉద్యోగంలో చేరిన ఆమె ఓ మానవ మృగం చేతిలో బలికావటంతో ఆ గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. మృతురాలి అంత్యక్రియలు సోమవారం స్వగ్రామంలో జరగనున్నాయి.

నా బిడ్డ రాఖీ పండక్కి కూడా రాలేదు 

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించటంతో అక్కడికి చేరుకున్న ఆమె తల్లి, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సెలవు లేదని తన బిడ్డ రాఖీ పండక్కి కూడా ఇంటికి రాలేదని మృతురాలి తల్లి తెలిపారు. తన కూతురును పొట్టనబెట్టుకున్న నిందితుడిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు.  ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి వద్ద మృతురాలి తల్లిదండ్రులు, నాయకులు కలిసి ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.