రహస్యంగా ‘డార్క్ షిప్’ ద్వారా రష్యాకు భారత ఇంధనం

రహస్యంగా ‘డార్క్ షిప్’ ద్వారా రష్యాకు భారత ఇంధనం
* రష్యా ఇంధన భద్రతకు భారత్ భరోసా!
ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న రష్యా ఇంధన రంగాన్ని ఆదుకోవడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడి రిఫైనరీలు మూతపడి పెట్రోల్ కొరత ఏర్పడటంతో, భారత్ నుంచి రష్యాకు పెద్ద ఎత్తున గ్యాసోలిన్ (పెట్రోల్) ఎగుమతులు జరుగుతున్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా ఆధారంగా ‘వోర్టెక్సా’  వెల్లడించింది. 
 
జూలై, ఆగస్టు నెలల్లో రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ 32 సార్లు డ్రోన్ దాడులు చేయడంతో దేశీయంగా ఇంధన ఉత్పత్తి ఏకంగా 70 శాతం పడిపోయింది.  ఫలితంగా రష్యాలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రష్యా ప్రభుత్వం తన దేశం నుంచి పెట్రోల్, డీజిల్ ఎగుమతులను నిషేధించింది.  ఈ నేపథ్యంలో గడిచిన రెండు నెలల్లో భారతీయ రిఫైనరీలు సుమారు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ను రష్యాకు పంపాయి.
గుజరాత్‌లోని ‘నయారా ఎనర్జీ’ కి చెందిన వడినార్ రిఫైనరీ నుంచి ఈ సరఫరా అధికంగా జరిగింది (ఈ కంపెనీలో రష్యా రోస్నెఫ్ట్‌కు సగం వాటా ఉంది).  ఆగస్టు నెలలో రష్యా సముద్ర మార్గం గ్యాసోలిన్ దిగుమతులు రోజుకు రికార్డు స్థాయిలో 1,25,000 బ్యారెళ్లకు చేరాయి. భారత్‌తో పాటు తుర్కియే, మొరాకో దేశాలు కూడా రష్యాకు గ్యాసోలిన్‌ను సరఫరా చేస్తున్నాయి. ఆగస్టులో రష్యాకు వెళ్లిన గ్యాసోలిన్‌లో 55 శాతం అంతర్జాతీయ ఆంక్షల పరిధిలో ఉన్న నౌకల ద్వారానే సరఫరా అయింది. 
 
భారత్ నుంచి వెళ్లిన పెట్రోల్ కార్గోలు మధ్యధరా సముద్రంలో అత్యంత రహస్యంగా ‘డార్క్ షిప్-టు-షిప్’ పద్ధతిలో బదిలీ అయ్యాయి. ఈ నౌకలు తమ గుర్తింపును దాచడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సిగ్నల్స్‌ను నిలిపివేశాయి. ఇంధన కొరత నుంచి తప్పించుకునేందుకు రష్యా పెట్రోల్ ఎగుమతులపై 2027 జనవరి చివరి వరకు, డీజిల్ ఎగుమతులపై 2026 సెప్టెంబర్ 1 వరకు నిషేధాన్ని పొడిగించింది.
 
మరోవైపు ప్రపంచంలో మూడో అతిపెద్ద రిఫైనరీగా ఉన్న భారత్ తన సామర్థ్యాన్ని 272 ఎంఎంటీపీఏ నుంచి 300 ఎంఎంటీపీఏకు పెంచుకోవడం ద్వారా గ్లోబల్ రిఫైనింగ్ హబ్‌గా తన స్థానాన్ని పటిష్ఠం చేసుకుంటోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అదే సమయంలో ఇరాన్ యుద్ధం, హ‌ర్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ తన ముడి చమురు దిగుమతులను కూడా విస్తృతం చేసుకుంది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు 41 దేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. 
 
హ‌ర్మూజ్ జలసంధి ద్వారా రవాణా నిలిచిపోవడంతో రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. అయితే కెప్లర్ డేటా ప్రకారం ఆగస్టులో దిగుమతులు కాస్త తగ్గి 2.1 మిలియన్ బ్యారెళ్లకు చేరాయి. అయినప్పటికీ దేశ మొత్తం దిగుమతుల్లో 40 % వాటాతో భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యానే కొనసాగుతోంది.