భగవత్ ప్రసంగంకు అనూహ్య స్పందన… రిజిస్ట్రేషన్లు నిలిపివేత 

భగవత్ ప్రసంగంకు అనూహ్య స్పందన… రిజిస్ట్రేషన్లు నిలిపివేత 

* భగవత్ తో చర్చలకు యూఎస్​సీఐఆర్​ఎఫ్ ఇప్పుడు సిద్ధం!

అమెరికాలోని 39 రాష్ట్రాల నుండి 5,000 మందికి పైగా ప్రజలు శనివారం మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిపతి మోహన్ భగవత్ ప్రసంగం కోసం సమావేశమవుతారని అంచనా వేస్తున్నారు. అయితే, డిమాండ్ విపరీతంగా పెరగడంతో రిజిస్ట్రేషన్లను మూసివేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

ఈవెంట్ ప్రతినిధి ప్రియా సమంత్ ప్రకారం, న్యూయార్క్‌లో జరిగే “యూనివర్సల్ వన్నెస్” కార్యక్రమంలో 85 నగరాల నుండి పాల్గొంటారు. దీనికి 200కు పైగా భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి.
ఈ సమావేశం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంపై ఉన్న వ్యతిరేకతకు స్పందిస్తూనే, నిర్వాహకులు ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ తాత్విక భావన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.“ప్రపంచం ఒక పెద్ద కుటుంబం అనే ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ తత్వానికి ఈ కార్యక్రమం ఒక వేడుక,” అని సమంత్ చెప్పారు.
“మన మధ్య భేదాలు ఉన్నప్పటికీ, మనమందరం శాంతి సామరస్యాలతో జీవించగలము,” అని ఆమె పేర్కొన్నారు. “ఈ కార్యక్రమం ద్వారా, అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యేలా ఆ సందేశాన్ని ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని వివరించారు.  ఈ కార్యక్రమానికి మొదట సాధారణ రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించారు, కానీ తాము సర్దుబాటు చేయగలిగిన దానికంటే ఎక్కువ అభ్యర్థనలు రావడంతో నిర్వాహకులు ఇప్పుడు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు.
“ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్న అభ్యర్థనలతో మాకు వెల్లువెత్తింది, అందుకే దీనిని మూసివేశాము, కానీ ఇది ఓపెన్ రిజిస్ట్రేషన్,” అని సమంత్ చెప్పారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో హాజరు కాలేకపోయిన వారు ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించగలరు. ఈ సమావేశాన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సర్వమత కార్యక్రమంగా రూపొందించారు. భారతీయ-అమెరికన్ యువత అకాపెల్లా ప్రదర్శన ఇవ్వనుండగా, భజనలు కూడా ఆలపిస్తారు.

ఈ కార్యక్రమం రక్షాబంధన్ వారాంతంలో జరుగుతోంది. ఈ పండుగ “ఒకరికొకరు రక్షణ, శ్రద్ధ, బంధానికి” ప్రతీక అని సమంత్ వర్ణించారు. భగవత్ హాజరుపై వచ్చిన వ్యతిరేకతను కూడా నిర్వాహకులు ప్రస్తావిస్తూ, విభేదాలు సంభాషణను ఆపకూడదని ఆమె స్పష్టం చేశారు. “మన మధ్య భేదాలు ఉండవచ్చు, తీవ్రమైన భేదాలు తప్పకుండా ఉంటాయి. అయినా మనం ఏకం కాగలం, ఒకే వేదికపై కూర్చుని మన విభేదాలను చర్చించుకోగలం,” అని సమంత్ చెప్పారు.

వ్యతిరేక అభిప్రాయాలతో మమేకమవ్వడానికీ, వాటిని అంగీకరించడానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆమె వివరించారు. “సంభాషణ అంటే ఆమోదం తెలపడం కాదు, వినడం అంటే ఏకీభవించడం కాదు, అలాగే అవగాహన చేసుకోవడం అంటే మీ భిన్నమైన అభిప్రాయాలను వదులుకోవడం కాదు,” అని ఆమె పెర్క్న్నారు. “ఏకత్వం అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు. మన మధ్య భిన్నతలు ఉన్నప్పటికీ, మనం కలిసి పనిచేయగలమని దీని అర్థం” అని తెలిపారు.

సంఘర్షణలు, విభజనలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ కార్యక్రమ సందేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న డాక్టర్ అవినాష్ గుప్తా తెలిపారు. “విభజనలతో కూడిన ఈ ప్రపంచంలో మరియు ఈ క్లిష్ట సమయంలో, మనం ఐక్యంగా ఉంటూ… ఏకత్వం, శాంతి, సామరస్య సందేశాన్ని ఒకరికొకరు చాటిచెప్పడం చాలా ముఖ్యం,” అని గుప్తా పేర్కొన్నారు. ఈ సమావేశం వెనుక ఉన్న ఆలోచనను ఆయన, “ప్రపంచమే ఒక కుటుంబం” అనే మన ప్రాచీన భారతీయ సంస్కృతికి చెందిన శాశ్వతమైన తత్వంగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న, ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్’లో స్వచ్ఛంద కార్యకర్తగా ఉన్న అంకుర్ వైద్య, కేవలం భారతీయ-అమెరికన్ వర్గాలే కాకుండా ఇతర వర్గాల ప్రజలు కూడా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. “విశాల అమెరికన్ సమాజం, ముఖ్యంగా న్యూయార్క్ నగర ప్రజలు ఇందులో పాల్గొనాలని, మేము పంచుకోవాలనుకుంటున్న విషయాల్లోని సత్యాన్ని తెలుసుకోవాలని మేము కోరుతున్నాము,” అని వైద్య చెప్పారు.

“అందరినీ కలుపుకుపోవడం (సమ్మిళితత్వం), అందరి శ్రేయస్సు అనేదే ఈ కార్యక్రమం అందించాలనుకుంటున్న సందేశం,” అని ఆయన చెప్పారు. 1925లో నాగ్‌పూర్‌లో స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తుతం తన స్థాపన శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. 2009 నుండి భగవత్ దీనికి ‘సర్ సంఘచాలక్ గా వ్యవహరిస్తున్నారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరగనున్న ఈ కార్యక్రమం, ఆయన అమెరికా పర్యటనలో ఒక భాగం.

మరోవంక, కొద్ది రోజుల క్రితం  ఆర్ఎస్ఎస్‌ ​పై ఆంక్షలు విధించాలని, ఆ సంస్థ అధినేత డా. మోహన్‌ భగవత్‌కు  అమెరికా పర్యటనకు జారీ చేసిన వీసాను ఉపసంహరించుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరిన  అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్​సీఐఆర్​ఎఫ్) అధ్యక్షుడు ఆసిఫ్​ మహమూద్​ ​, ఇప్పుడు భగవత్​తో నేరుగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
మోహన్ భగవత్ తో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పిస్తే తాను సానుకూలంగా స్పందిస్తానని ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ తెలిపారు.  చర్చలకు ఏర్పాట్లు జరిగితే కూర్చొని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ అభిప్రాయాలను మార్చే విధంగా ఆర్​ఎస్​ఎస్​ తరఫున కొన్ని హామీలు, భరోసాలు ఇవ్వొచ్చని, అలాంటివి తమ వైఖరిలో మార్పునకు దారితీయవచ్చని పేర్కొన్నారు.

మత స్వేచ్ఛ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై తమ ఆందోళనలను వివరించడమే తమ ఉద్దేశమని అసిఫ్‌ మహమూద్ తెలిపారు. భారత్​పై తనకు గౌరవం ఉందని, అయితే ఆర్​ఎస్​ఎస్​ వంటి సంస్థలు ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాయని తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆధారంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇది మత స్వేచ్ఛతో పాటు ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తోందని ఆరోపించారు.

ఇదే సందర్భంగా పాకిస్థాన్‌, చైనాలో మతపరమైన మైనారిటీల పరిస్థితిపైనా ఆసిఫ్ మహమూద్ ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌లో హిందూ బాలికల బలవంతపు మతమార్పిడిపై తాను పలుమార్లు గొంతెత్తినట్లు చెప్పారు. క్రైస్తవులు, సిక్కులు, అహ్మదీయ ముస్లింలు కూడా అక్కడ ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చైనా, పాకిస్థాన్‌లను ‘కంట్రీస్‌ ఆఫ్‌ పర్టిక్యులర్‌ కన్సర్న్‌’గా గుర్తించాలని యూఎస్​సీఐఆర్​ఎఫ్ చాలాకాలంగా సిఫారసు చేస్తోందని మహమూద్ తెలిపారు.