సీఎన్‌జీ ధరను కిలోకు రూ.3.89 మేర పెంపు

సీఎన్‌జీ ధరను కిలోకు రూ.3.89 మేర పెంపు
దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) వాహనదారులపై అదనపు భారం మోపింది. సీఎన్‌జీ ధరను కిలోకు రూ.3.89 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాళ‌ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

తాజా ధరల పెరుగుదలతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.86.98 కి చేరింది. అదేవిధంగా నోయిడా, ఘజియాబాద్‌లలో రూ.95.59 గా, గురుగ్రామ్‌లో రూ.92.01 గా కొత్త ధరలు ఖరారయ్యాయి. మీరట్, ముజఫర్‌నగర్, షామ్లీ వంటి ప్రాంతాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) ధరలు గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

సీఎన్‌జీ  ఉత్పత్తి కోసం అవసరమైన సహజ వాయువును ప్రధానంగా ఎల్ఎన్‌జీ రూపంలోనే దిగుమతి చేసుకుంటున్నారు.  హార్ముజ్ జలసంధి గుండా సాగే ఇంధన రవాణాలో ఆటంకాలు ఏర్పడటం, శీతాకాలం దృష్ట్యా ఐరోపా దేశాలు తమ నిల్వలను పెంచుకోవడం వంటి పరిణామాల వల్ల సరఫరా వ్యయం పెరిగింది. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తర్వాత, మే 15 నుంచి ఇప్పటివరకు సీఎన్జీ ధరలు పెరగడం ఇది ఐదోసారి.

అయితే, అంతర్జాతీయ మార్కెట్​లో తీవ్రమైన అస్థిరత ఉన్నప్పటికీ, ఐజీఎల్​ భారత వినియోగదారులకు చాలా వరకు రక్షణ కల్పించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, దిల్లీ సీఎన్‌జీ (ఐజీఎల్ రిటైల్) ధర కిలోకు రూ.77.09 నుంచి రూ.83.09 కు క్రమంగా పెరిగింది, ఇది సుమారుగా 7.8% స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది.

ఈ ధరల పెంపు ప్రభావం ప్రైవేట్ కార్లు, ట్యాక్సీలు, ఆటోరిక్షాలు సహా వాణిజ్య వాహనాల నిర్వహణ వ్యయంపై పడనుంది. పెరిగిన ఇంధన ఖర్చుల భారాన్ని వాహనదారులు ప్రయాణికులపై మోపే అవకాశం ఉంది. రవాణా ఛార్జీలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.