గతంలో వచ్చిన వివిధ సాంకేతిక విప్లవాలు కొత్త ఉద్యోగాలను సృష్టించాయని, కానీ ఏఐ విప్లవం మాత్రం పూర్తిగా భిన్నమైనదని గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగైపోతాయని, కేవలం కొన్ని రంగాలు మాత్రమే మానవులకు ఉపాధిని ఇవ్వగలవని తెలిపారు.
ఏఐ కోడింగ్ సామర్థ్యాలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, నిపుణులైన మనుషుల కంటే మెరుగ్గా పనిచేస్తున్న ఈ సాంకేతికతవల్ల సమీప భవిష్యత్తులోనే ఉపాధి రంగంలో తీవ్ర సంక్షోభం రానుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ కంపెనీలు దీనివల్ల వచ్చే ముప్పును తక్కువ చేసి చూపిస్తున్నాయని, పెట్టుబడులు తగ్గిపోతాయనే భయంతో అసలు ఆందోళనలను బహిరంగంగా అంగీకరించడం లేదని విమర్శించారు.
ఉద్యోగాలు కోల్పోతున్న శ్రామికవర్గాన్ని ఆదుకునేందుకు బిల్ గేట్స్ కొన్ని విప్లవాత్మక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. ఏఐ, రోబోల వినియోగంతో మనుషులను తొలగించే సంస్థలపై ప్రత్యేకంగా ‘రోబో / ఏఐ పన్ను’ విధించాలని, ఆ నిధులతో నిరుద్యోగులకు పునరావాసం కల్పించాలని సూచించారు. అంతేకాకుండా, వైద్య రంగంలో రోగులకు సేవ చేయడం, కేర్ గివింగ్ వంటి మానవీయ బాధ్యతలను కేవలం మనుషులకే పరిమితం చేసేలా చట్టాలు తేవాలని ప్రతిపాదించారు.
కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, ఏఐని ఉపయోగించి ప్రమాదకర జీవాస్త్రాలు లేదా నూతన రసాయన ఆయుధాలు తయారు చేసే ముప్పు పొంచి ఉందని గేట్స్ హెచ్చరించారు. అణు ఆయుధాలు, అంతర్జాతీయ విమానయాన రంగాలకు ఏ విధంగా కఠినమైన అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయో, అదే రీతిలో ఏఐ నియంత్రణ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకమై ప్రత్యేక పర్యవేక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన బలంగా ఆకాంక్షించారు.

More Stories
టాటా సన్స్ ఛైర్మన్గా మరోసారి చంద్రశేఖరన్.. చెల్లదన్న నోయెల్ టాటా
ఇకపై మెడికల్ స్టోర్లలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
అమెరికా క్రైస్తవ బృందం సీబీఐ ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘనలపై కేసు