ఉగ్రవాద రహిత ప్రాంతం దిశగా భారత్‌ లక్ష్యం

ఉగ్రవాద రహిత ప్రాంతం దిశగా భారత్‌ లక్ష్యం
 
పొరుగు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వానికి నిరంతరం ముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమష్టి చర్యలు అవసరమని కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో  జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 
ఎస్‌సీఓ వేదికగా ప్రాంతీయ భద్రత, అనుసంధానం, ఆర్థిక అవకాశాలు, శాంతి, స్థిరత్వానికి సంబంధించిన అంశాలను భారత్ ప్రస్తావించనుందని పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం వంటి సవాళ్లపై సభ్యదేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చేయనున్నట్లు తెలిపారు.  ఎస్‌సీఓ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారని, 2017 నుంచి భారత్ ఈ సంస్థలో చురుకైన, నిర్మాణాత్మక సభ్యదేశంగా కొనసాగుతోందని చెప్పారు.
“భద్రత, అనుసంధానత, అవకాశాల పునాదులపై ఆధారపడిన ఈ ప్రాంతం పట్ల భారతదేశం కలిగి ఉన్న దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, అలాగే మన పొరుగు ప్రాంతంలోనూ ఆవల కూడా శాంతికి, స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాల ముప్పు లేని ప్రాంతాన్ని సాకారం చేసే దిశగా ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 
భారత విస్తృత పొరుగు దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లో ఆయన పర్యటించనున్నారు.  ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో మోదీ అధికారిక పర్యటన కొనసాగుతుంది. 
 
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచే అంశాలపై మిర్జియోయెవ్‌తో మోదీ చర్చలు జరపనున్నారు. ‘వికసిత్ భారత్’, ‘యాంగీ ఉజ్బెకిస్తాన్’ లక్ష్యాలకు అనుగుణంగా ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత్ భావిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.

“వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాలలో మన సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపైనా, అలాగే ‘విక్సిత్ భారత్’, ‘యాంగీ ఉజ్బెకిస్తాన్’ అనే మన ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంపైనా అధ్యక్షుడు మీర్జియోయెవ్‌తో జరపబోయే చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను,” అని ప్రధాని తెలిపారు. 
 
ఎస్‌సీఓ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ఇతర దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుతిన్‌తో జరిగే భేటీపై ఆసక్తి నెలకొంది.