జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణిల కోసం అమెరికాతో భారత్ ఒప్పందం 

జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణిల కోసం అమెరికాతో భారత్ ఒప్పందం 
జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం, అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. లాక్‌హీడ్ మార్టిన్, ఆర్‌టిఎక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మధ్యశ్రేణి గైడెడ్ క్షిపణి వ్యవస్థ, సాయుధ వాహనాల వంటి వివిధ లక్ష్యాలను ఛేదించడానికి ఉద్దేశించబడిందని రాయబార కార్యాలయం పేర్కొంది.  ఈ క్షిపణి వ్యవస్థను ప్రస్తుతం అమెరికా సైన్యం, మెరైన్ కార్ప్స్‌తో పాటు వివిధ అంతర్జాతీయ వినియోగదారులు కూడా ఉపయోగిస్తున్నారని రాయబార కార్యాలయం తెలిపింది.
ఈ ఒప్పందం ఇరు దేశాల రక్షణ రంగాలకు సహకరించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.  “భవిష్యత్ సహకారానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని, ఇది ఇరు దేశాల రక్షణ పారిశ్రామిక పునాదులను మెరుగుపరుస్తుందని మేము భావిస్తున్నాము,” అని ఆయన తెలిపారు. విజయవంతమైన మిస్సైల్స్‌గా వీటికి పేరుంది.
ఇది చాలా తేలికైన క్షిపణి. దీన్ని నేరుగా భుజంపై నుంచి ప్రయోగించవచ్చు. ఇది ఆటోమేటిక్‌ గైడెన్స్ మెకానిజం కలిగి ఉంది. దీన్ని లాంచ్‌ చేయగానే టార్గెట్‌ను చేధించగలదు. వీటిని ఒకసారి ప్రయోగించిన తర్వాత సైనికులు శతృవులకు చిక్కకుండా మళ్లీ రహస్యంగా రక్షించుకోవచ్చు. దీన్ని బిల్డింగులు, బంకర్ల నుంచి కూడా తేలికగా ప్రయోగించవచ్చు. 

ఈ జావెలిన్ క్షిపణుల్ని కొనుగోలు చేయడం ద్వారా  భారత్ -అమెరికా మధ్య సైనిక సహకారం మరింత బలపడుతుందని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. భారత్ కు విక్రయించబోయే మిస్సైల్స్ డీల్ 93 మిలియన్ డాలర్లుగా ఉంది. దీని ప్రకారం 100 వరకు జావెలిన్ సిస్టమ్స్, 216 ఎక్స్‌క్యాలిబర్ గైడెడ్ అర్టిల్లరీ ప్రొజెక్టైల్స్‌ను విక్రయించనున్నారు.

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం చేసే దేశాలలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. అలాగే, ఉక్రెయిన్ తర్వాత ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాలలో రెండవ స్థానంలో ఉంది.  అక్టోబర్‌లో, భారత్, అమెరికా 10 సంవత్సరాల రక్షణ చట్ర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత ఉత్పత్తులపై వాషింగ్టన్ అధిక సుంకాలు విధించడం, రష్యా చమురు కొనుగోలు చేసినందుకు న్యూఢిల్లీని శిక్షించడం,  భారతదేశానికి చిరకాల శత్రువైన పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం వంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల క్షీణించినప్పటికీ, రక్షణ భాగస్వామ్యం చెక్కుచెదరకుండా కొనసాగుతోంది.