రెండు రోజుల క్రితం నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 469కి చేరిందని నేపాల్ పోలీసులు శుక్రవారం తెలిపారు. ప్రాణాలతో ఉన్నవారిని కనుగొనే ఆశలు సన్నగిల్లడంతో, సహాయక బృందాలు భారీ యంత్రాలను ఉపయోగించి నేపాల్ పట్టణాల్లో బురద, శిథిలాలను తొలగించి గాలించాయి. అధికారులు మళ్లీ వరదలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కృషి చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో ధృవీకరించబడిన మృతుల సంఖ్య 469 కాగా, నేపాల్‌తో పాటు పొరుగున ఉన్న టిబెట్‌లో దాదాపు 1,000 మందికి పైగా గల్లంతయ్యారు. బుధవారం ఉదయం హిమానీనదం కూలిపోవడంతో, హిమాలయ పర్వత నదీ వ్యవస్థల గుండా రాళ్లు, మంచు, బురద, శిథిలాలతో కూడిన భారీ ప్రవాహం ప్రవహించింది.ఈ వరద గ్రామాలు, లోయలను చీల్చివేసింది. కాఠ్మండును టిబెట్‌లోని లాసాతో కలిపే, ట్రెక్కింగ్ చేసేవారికి, యాత్రికులకు ప్రసిద్ధి చెందిన మార్గంలో విద్యుత్ కేంద్రాలు, రోడ్లు, వంతెనలను ధ్వంసం చేసింది. గల్లంతైన వారిలో కనీసం 540 మంది విదేశీయులు ఉన్నారు.
నేపాల్‌లోని అధికారులు పట్టణాలు, లోయలలో చిక్కుకుపోయిన వేలాది మంది కోసం హెలికాప్టర్ల ద్వారా ప్రాణాలతో ఉన్నవారిని వెతికారు, వారికి అత్యవసర సామాగ్రిని అందించారు. అదే సమయంలో, కొన్ని జాగింగ్ కుక్కల సహాయంతో అత్యవసర సేవల సిబ్బంది మైదాన ప్రాంతాల్లోకి కొట్టుకువచ్చిన డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీశారు.
ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎక్కడ చూసినా వరద నీరు, పెద్దయెత్తున పేరుకుపోయిన బురద కన్పించింది. నేపాల్‌లో 826 మంది గల్లంతు కాగా, అందులో 300 మందికి పైగా భారతీయులున్నారు. కాగా, ఇదే వరదలకు టిబెట్‌లో ముగ్గురు మరణించగా, 558 మంది గల్లంతైనట్టు చైనా సీసీటీవీ వెల్లడించింది. వరదలకు వందలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. వంతెనలు, పలు ప్రాజెక్టులు కూడా నాశనమయ్యాయి. నువాకోట్, రసువా జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది.
డజన్ల వంతెనలు పాడైపోయాయని, 40 కి.మీ మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లోని నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలిస్తున్నారు. నేపాల్‌లోని రసువా జిల్లా దిగువ ప్రాంతాల్లో వరద విధ్వంసమే సృష్టించింది. త్రిశూలి నది నుంచి పోటెత్తిన వరద నీరు, వ్యర్ధాలు ఇండ్లు, రోడ్లు, వంతెనలు, హైడ్రోపవర్ ప్రాజెక్టును ముంచెత్తాయి. తిమురే, త్రిశూలి బజార్, భెట్రాపతి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బలమైన నీటి ప్రవాహానికి ఒక హెలిప్యాడ్ కూడా కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కాగా, చైనాలోని గిరోంగ్ పట్టణంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా, పోర్టు ప్రాంతం మాత్రం ఇంకా అంధకారంలోనే ఉంది. వరద ప్రభావ ప్రాంతాల్లో గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ధాడింగ్, గోర్ఖా, నువాకోట్, తనహూన్, రసువా, పశ్చిమ నవల్పరాసి ప్రాంతాల నుంచి కూడా ప్రాణనష్టం నమోదైంది.
వరదకు గురైన నువాకోట్ జిల్లాలో నేపాల్ ప్రధాని బాలేందర్ షా గురువారం పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా చూశారు. అధికారులు, నేతలతో సమావేశమై చేపట్టాల్సిన సహాయ చర్యల గురించి చర్చించారు. భారత్ పంపిన సహాయ సామగ్రిని తీవ్రంగా వరద ప్రమాదానికి గురైన ప్రాంత వాసుల కోసం హెలికాప్టర్ల ద్వారా విడిచి పంపిణీ చేస్తున్నట్టు నేపాల్ సైనిక ప్రతినిధి రాజారామ్ బసెంట్ తెలిపారు.
“288 మంది భారతీయులతో ప్రస్తుతం సంబంధాలు లేవు. వీరిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లినవారితో పాటు పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. 73 మంది భారతీయులు త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన 37, 49 మందితో కూడిన రెండు బృందాలు, బంగాల్ చెందిన 32 మంది, కేరళకు చెందిన 33 మంది సహా పలువురి ఆచూకీ లేదు. వీరి ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
“అలాగే టిబెట్‌లోని 200 మంది భారతీయులు సాయం కోరారు. నేపాల్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. కష్టకాలంలో భారత్ నేపాల్‌కు అండగా నిలుస్తోంది” అని జైస్వాల్ తెలిపారు . అయితే ఆ తర్వాత తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు.
భారత్ మానవతా సాయం
ఇది కాకుండా, నేపాల్‌కు అందిస్తున్న సహాయక చర్యలను కూడా భారత్ ముమ్మరం చేసిందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.బుధవారం నాడు 10 టన్నుల మానవతా మరియు విపత్తు సహాయక సామగ్రిని పంపిన తర్వాత, గురువారం నాడు సైనిక రవాణా విమానం ద్వారా మరో 37.5 టన్నుల సామగ్రి, మందులు, ఆహార పొట్లాలను పంపింది. దీంతో పంపిన మొత్తం సహాయం 47.5 టన్నులకు చేరింది.
మూడు రోజుల్లో మరో ముప్పు.. చైనా హెచ్చరిక
కాగా, ఇప్పటికే ఆకస్మిక వరదలతో భారీగా దెబ్బతిన్న నేపాల్‌కు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. మరో 72 గంటల్లోగా (3 రోజుల్లో) బ్యారియర్ సరస్సు పొంగి పొర్లి, వరద ముంచెత్తే అవకాశం ఉందని నేపాల్‌ను చైనా హెచ్చరించింది. ఈ సరస్సు నేపాల్ సరిహద్దులో చోచెన్ ఖోలా-పురెపు టాంగ్పో నదుల మధ్య ఉంటుంది. రెండు నదుల మధ్య ఉన్న బ్యారియర్ సరస్సు ఉప్పొంగే అవకాశం ఉందని చైనా హెచ్చరించింది.
చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన ప్రకారం ఈ సరస్సు గురువారం ఉదయానికి 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సామర్ధ్యం కలిగి ఉంది. ఇప్పటికే ఇది అత్యధిక స్తాయిలో పొంగి, ప్రవహిస్తోంది. మరో మూడు రోజుల్లో ఇంకో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఈ సరస్సులోకి చేరే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సరస్సు కూడా ఉప్పొంగి, స్థానిక ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సరస్సులో నీటి స్థాయిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వరద ముప్పును అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.
More Stories
బంగ్లాపై భారీ విజయంతో ఫైనల్లో భారత మహిళల జట్టు
తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన జపాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్
రష్యాపై వేయి డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయన్.. ఇద్దరు మృతి