‘మీరు హుందాగా తప్పుకోండి. ఇది పార్టీ అధిష్టానం ఆదేశం’ అని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం భట్టి విక్రమార్క తన నివాసంలో (ప్రజాభవన్) ఆయనతో చర్చించినట్లు సమాచారం. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తే, ఈ వివాదం ఇక్కడితో సమిసిపోతుందని, అది హుందగా ఉంటుందని వారిద్దరూ నచ్చచెప్పే ప్రయత్నాలు చేసిన్నట్లు తెలుస్తున్నది.
అయితే కొండా మురళి ఏది అయితే అదే అవుతుందని మొండికేసినట్టు తెలిసింది. ఈ దశలో మంత్రి పదవికి రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని, ఇదే చివరి అవకాశం అని చెప్పినట్టు తెలిసింది. అధిష్టానం సీరియస్‌గా ఉన్నదన్న విషయాన్ని గమనించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా నచ్చజెప్పె ప్రయత్నం చేసినప్పటికీ, అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చుద్దామంటూ కొండా మురళి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
ఈ భేటీ ముగిసిన అనంతరం కొండా మురళితో జరిగిన చర్చా, అందుకు ఆయన స్పందనను భట్టి విక్రమార్క సీఎం రేవంత్‌రెడ్డికి వివరించినట్లు తెలిసింది. ఇలా ఉండగా భట్టితో భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
కొండా సుస్మిత పటేల్ తన ప్లాన్ -ఏ మాత్రమే చెప్పారని, ప్లాన్-బి ఏమిటో తమకు తెలియదని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆమెను భర్తరఫ్ చేస్తే పార్టీలో పెద్ద ముసలం తధ్యం అనే హెచ్చరిక చేసిన్నట్లు కనిపిస్తుంది. రెండు రోజుల క్రితం ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా కొండా సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరగా, ఆమె తిరస్కరించినట్లు తెలిసింది. చివరిగా మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కొండా మురళిని పిలిపించి అదే మాట చెప్పినట్లు తెలిసింది.
అయితే భట్టి విక్రమార్క గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని బహిరంగంగా కొండా సురేఖ వ్యవహారంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. కనీసం ఆమె కుమార్తె ప్రకటనలను సహితం ఖండించే ప్రయత్నం చేయలేదు. తాము పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలమని, పార్టీని వీడే ప్రసక్తి లేదని కొండా మురళి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సుస్మిత ప్లాన్-బి ఏమిటో?
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళి కొండా సుస్మిత పటేల్ ప్లాన్ -ఏ మాత్రమే చెప్పారని, ప్లాన్-బి ఏమిటో తమకు తెలియదని చెప్పడం కాంగ్రెస్ వర్గాలలో కలకలం రేపుతోంది. పైగా, సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, 35 ఏళ్ల వయసున్న ఆమెకంటూ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయని, ఆమె ప్రశ్నించే అధికారం తమకు లేదని అంటూ ఆయన పరోక్షంగా కుమార్తెను వెనుక వేసుకు వచ్చారు.
మంత్రి కొండా సురేఖ అందుబాటులో లేరన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఆమె వరంగల్‌లోనే ఉన్నారని మంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారని చెప్పారు. కాగా, భట్టి విక్రమార్కను తాను కేవలం బిల్లుల కోసం మాత్రమే కలిశానని, అక్కడ కొండా సురేఖ అంశం చర్చకు రాలేదని పేర్కొనడం గమనార్హం.

More Stories
నేపాల్‌కు రాష్ట్రపతి, ప్రధాని సంఘీభావం.. భారత్ అప్రమత్తం
నేపాల్‌లో జల విలయం.. 165 మంది మృతి
’భూ భారతి’ మంత్రులకు వజ్రాల హారతి